TS: అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు ఏపీ జనం!

by GSrikanth |
TS: అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు ఏపీ జనం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ ఏప్రిల్ 14న చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత బిడ్డలను హైదరాబాద్‌కు తరలించి భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సుమారు లక్షమందికి పైగా ప్రజలను ఈ సభకు తరలించాలని భావిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఇటీవల నిర్వహించిన సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి దళితులను తరలించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బీఆర్ఎస్ ఏపీ శాఖ యాక్టీవ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న దళిత సంఘాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి తరలించేలా ప్రత్యేక బస్సులను సైతం బీఆర్ఎస్ మద్దతుదారులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రావెల కిశోర్ బాబు ఆధ్వర్యంలో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని అక్కడి నుంచి పెద్ద ఎత్తున దళితులను ఈ సభకు రప్పించే యోచనలో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బీఆర్ఎస్ ఏపీ శాఖను ఏర్పాటు చేసిన అనంతరం తెలంగాణలో జరగుతున్న ముఖ్యమైన కార్యక్రమాలకు ఏపీ నుంచి జనసమీకరణకు గులాబీ బాస్ ప్రయత్నిస్తున్నారు. గతంలో ఖమ్మంలో జరిగిన సభకు ఏపీ నుంచి జనాన్ని తరలించగా తాజాగా అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సైతం ఆంధ్ర ప్రజలను తీసుకువచ్చేలా ప్రణాళికలు వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed