ఆగస్టు 16 నుంచి పీజీ సెమిస్టర్ పరీక్షలు.. ఓయూ వీసీ రవీందర్

by Javid Pasha |
ఆగస్టు 16 నుంచి  పీజీ సెమిస్టర్ పరీక్షలు..  ఓయూ వీసీ రవీందర్
X

దిశ , తెలంగాణ బ్యూరో : ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 16 నుంచి నిర్వహిస్తున్నట్టు ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవిందర్ యాదవ్ వెల్లడించారు. అలాగే ఈ నెల 26, 27వ తేదీల్లో ఇంటర్నల్స్, తదుపరి ప్రాక్టికల్స్ పూర్తి చేయాలని పరీక్షల తేదీలకు అనుగుణంగా సిలబస్ పూర్తి చేసుకోవాలని అయన సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం వీసీ నేతృత్వంలో జరిగిన ప్రిన్సిపల్స్, సంబంధిత అధికారుల సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు. కొన్ని సబ్జెక్టులకు సంబంధించి సిలబస్ పూర్తి కాలేదన్న విషయమై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ బి.రెడ్యానాయక్, ప్రిన్సిపాల్స్ ను వీసీ ఆరాతీశారు.

భవిష్యత్తులో తిరిగి ఇలాంటి పరిస్థితి రాకుండ క్యాలెండర్ ప్రకారమే సిలబస్ పూర్తి చేయటం, పరీక్షలు నిర్వహించటం జరగాలని వీసీ స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలతో ఎంసీజే ప్రవేశపరీక్షను తిరిగి నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన తేదీని వీలైనంత త్వరగా వెల్లడించాలని సమావేశంలో నిర్ణయించారు. మార్కెట్ కు అనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సుల విషయమై సమావేశంలో చర్చ జరిగింది. కొత్తగా ప్రవేశపెట్టిన బీఎస్సీ డాటా సైన్స్, బీఎస్సీ హానర్స్ కంప్యూటర్స్, బీబీఏ రిటైల్ మేనేజ్ మెంట్, ఎంబీఏ టూరిస్ట్ అండ్ ట్రాన్స్ పోర్ట్ మేనేజ్ మెంట్, పీజీ మైక్రోబయాలజీ ప్రెగ్మెంటేషన్ లాంటి సెల్ఫ్ పైనాన్స్ కోర్సులకు అనూహ్య స్పందన వచ్చిందని సంబంధిత ప్రిన్సిపల్స్ వీసీకి తెలిపారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హాస్టళ్లలో ఉత్పన్నమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని యూనివర్శిటీ బిల్డింగ్, విద్యుత్తు, ఆరోగ్య, పారిశుధ్య అధికారులను వీసీ ఆదేశించారు.

అవసరమైన చోట్ల హాస్టళ్ల చుట్టూ విద్యుత్తు దీపాలను అమర్చాలని సూచించారు. ఓయూ పరిపాలనా విభాగంలో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ఓయూ క్యాంపస్, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థి వ్యవహారాలు, యూజీసీ వ్యవహారాల డీన్లు, జిల్లా పీజీ కళాశాలల విభాగం, అకడమిక్ ఆడిట్ సెల్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, బిల్డింగ్ డివిజన్ డైరెక్టర్లు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, చీఫ్ వార్డెన్, మహిళా వసతి గృహం డైరెక్టర్, పౌరసంబంధాల అధికారి, ముఖ్య వైద్యాధికారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed