బీజేపీకి తెలంగాణతో పేగుబంధం లేదు.. చిహ్నం మార్పులపై ఒక్క నేత స్పందించలే: బీఆర్ఎస్

by Ramesh N |
బీజేపీకి తెలంగాణతో పేగుబంధం లేదు.. చిహ్నం మార్పులపై ఒక్క నేత స్పందించలే: బీఆర్ఎస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ పార్టీకి తెలంగాణతో పేగుబంధం లేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. ఈ మేరకు తాజాగా ట్విట్టర్ వేదికగా బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించింది. బీజేపీకి తెలంగాణ అన్ని రాష్ట్రాల లాగే ఒక రాజకీయ కార్యక్షేత్రం మాత్రమేనని, బీజేపీకి తెలంగాణతో పేగుబంధం లేదని విమర్శించింది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అస్థిత్వాన్ని, రాచరిక పోకడల పేరుతో తెలంగాణ వారసత్వ చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్‌లను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తుంటే.. పౌరసమాజం, మేధావి వర్గం రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా.. దున్నపోతు మీద వాన పడ్డట్టు కనీసం ఒక్క బీజేపీ నేత కూడా స్పందించకపోవడం అందుకు ఉదాహరణ.. అని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. ఇప్పటికీ, ఎప్పటికీ తెలంగాణ గళం, దళం, బలం బీఆర్ఎస్ మాత్రమేనని బీఆర్ఎస్ పేర్కొంది.

కాగా, చార్మినార్, కాకతీయ కళాతోరణం రాజముద్ర నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ క్రమంలోనే గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చార్మినార్‌ను రాజముద్ర నుంచి తొలగించడమంటే ప్రతీ హైదరాబాదీని అవమానపర్చినట్టే.. ప్రతి ఒక్కరిని అగౌరవపరిచినట్టే.. తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి గుర్తులుగా చార్మినార్, కాకతీయ కళాతోరణం ఉందని కేటీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed