CM Revanth Reddy: ప్రజలు తిరస్కరించినా.. కేసీఆర్‌లో మార్పు రాలేదు: సీఎం రేవంత్‌

by D.Reddy |   ( Updated:2025-02-24 09:08:20.0  )
CM Revanth Reddy: ప్రజలు తిరస్కరించినా.. కేసీఆర్‌లో మార్పు రాలేదు: సీఎం రేవంత్‌
X

దిశ, వెబ్ డెస్క్: BJP, BRSలపై పార్టీ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ (ఫిబ్రవరి 24) నిజామాబాద్‌లోని పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌పై (KCR) మండిపడ్డారు. ఫామ్‌హౌజ్‌లో కూర్చుని తమ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ అవసరం రాష్ట్రానికి లేదని, చేసింది చాలు.. ఇక ఫామ్‌హౌజ్‌లో విశ్రాంతి తీసుకొమ్మని ప్రజలు తీర్పునిచ్చారని సీఎం రేవంత్‌ అన్నారు. అయితే, ప్రజలు తిరస్కరించినా.. కేసీఆర్‌లో మార్పు రాలేదని మండిపడ్డారు. రాష్ట్రంతో పేగుబంధం తెంపుకుంటూ పార్టీ పేరు కూడా మార్చుకున్నారని సీఎం రేవంత్‌ అన్నారు.

ఎన్నికల్లో పోటీ చేయలేని వాళ్లకి మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఉందా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఏ అభ్యర్థికి ఓటెయ్యాలని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారో చెప్పాలన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే ఆ పార్టీలో పోటీ చేసే అభ్యర్థులే లేరని, బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ పార్టీగా చెప్పుకునే అర్హతే లేదని ఎద్దేవా చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చాకే 55,163 నియామకాలు చేపట్టిందన్నారు. అంతేకాదు, గ్రామీణ యువతి యువకుల్లో ఉండే నైపుణ్యాలను బయటి తీసేందుకు స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. క్రీడల్లో యువత రాణించేందుకు స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణ సాధనలో పట్టభద్రులదే కీలక పాత్ర అని అన్నారు. పట్టభద్రులు ఆలోచించి ఓటేయ్యాలన్నారు. టాటా కంపెనీతో ఒప్పందం నిజమైతే కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని కోరారు. అలాగే, స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు నిజమైతేనే, రైతులకు రుణ మాఫీ నిజమైతేనే, రైతు భరోసా పథకంలో భాగంగా ఏడాది రూ.6 వేలు ఇవ్వటం నిజమైతే, ఉచిత కరెంట్, ఉచిత నీరు ఇవ్వటం నిజమైతేనే, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చింది నిజమైతేనే ఓటేయ్యాలని రేవంత్ రెడ్డి కోరారు.

Next Story