సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కేనా..?

by Naveena |
సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కేనా..?
X

దిశ ప్రతినిధి,నిజామాబాద్ మార్చి30: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుందో, మా సారుకు మంత్రి పదవి ఎప్పుడస్తుందోననే చర్చ నిజామాబాద్ జిల్లాలో జోరుగా నడుస్తోంది. ఉగాది రోజున ఉంటుందనే చర్చ జోరుగా నడిచినా.. ఆ రోజున ప్రభుత్వం పంచాంగశ్రవణం, పచ్చడి పంపిణీతోనే సరిపెట్టింది కానీ.. మంత్రి వర్గవిస్తరణ జరగలేదు. ఈ ఉగాదికి మంత్రివర్గ విస్తరణ కచ్చితంగా ఉంటుందని, రాష్ట్ర కేబినెట్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంతా భావించారు. ఉగాది పోయింది.. రంజాన్ కూడా పోయింది. కానీ, సుదర్శన్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణపై సుదర్శన్ రెడ్డి, ఆయన అనుచరులు పెట్టుకున్న ఆశలు మాత్రం నీళ్లలో వేసిన గొడ్డలి మాదిరిగా ఉన్నచోటే ఉండిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికి దాదాపు15 నెలలవుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. రాజకీయంగా బాగా చైతన్యం ఉన్న జిల్లాగా నిజామాబాద్ కు పేరుంది. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పగలిగే నాయకులు పుట్టిన జిల్లాగా నిజామాబాద్ జిల్లాకు పేరుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రంలో రెండు సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనతను సాధించిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) నిజామాబాద్ కు చెందినవాడే కావడం గమనార్హం. నిజామాబాద్ జిల్లా రాజకీయాలకే కాదు ఉద్యమాలకు కూడా ఆయువు పట్టు. అందుకే తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ నిజామాబాద్ జిల్లా మోతె గ్రామం నుండే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇక్కడి నుండే గ్రామంలోని మట్టిని ముడుపుకట్టి తీసుకెళ్లారు.

తెలంగాణ సాధించిన తరువాత మళ్లీ ఆముడుపును ఇక్కడి మోతె గ్రామానికే వచ్చి విడిచారు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన జిల్లా నుండి అర్గుల రాజారాం, శనిగరం సంతోష్ రెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి వంటి రాజకీయ ఉద్ధండులు రాష్ట్ర రాజకీయాల్లో తమ సత్తాను చాటారు. అలాంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వం ఏర్పడి 15 నెలలవుతున్నా.. ఒక్క మంత్రి పదవి రాకపోవడంపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అధికార పార్టీలోనే కాదు.. ప్రతిపక్ష పార్టీలోనూ ఈ విషయంపై చర్చజరుగుతున్నప్పటికీ వారు బయట పడటం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ఇంతగా నిర్లక్ష్యం చేయడం గతంలో ఎన్నడూ జరగలేదని ఇతర పార్టీల నేతలు సైతం మాట్లాడుకుంటున్న పరిస్థితులున్నాయి.

గంపెడాశలతో పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచింది నలుగురు ఎమ్మెల్యేలే. నిజామాబాద్ జిల్లాలో బోధన్ నుండి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుండి డాక్టర్ భూపతిరెడ్డి లు గెలుపొందగా.. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నుండి మదన్ మోహన్ రావు, జుక్కల్ నుండి కృష్ణకాంత్ గెలిచారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి సెగ్మెంట్లలో బీజేపీ ఎమ్మెల్యేలు గెలవగా, బాల్కొండ , బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్ లో చేరి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పదవి దక్కించుకున్నారు. ఇక కాంగ్రెస్ లో ఇప్పుడున్న నలుగురు ఎమ్మెల్యేల్లో సుదర్శన్ రెడ్డి తప్ప మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు మొదటి సారి గెలిచిన వారే కావడం, వీరిలో అత్యంత సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి ఒక్కరే కావడంతో మంత్రి పదవిపై సుదర్శన్ రెడ్డి సహజంగానే గంపెడాశలతో ఉన్నారు. తనను తాను మంత్రిగానే భావిస్తున్నారని, జిల్లాస్థాయి అధికారులు, తోటి పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆయనను అదే స్థాయిలో చూస్తున్నారని, అధికారులు కూడా ఆయనకు ఒక మంత్రికి ఇచ్చేమర్యాదలిస్తున్నారని సుదర్శన్ రెడ్డి అనుచరులు చెప్పుకుంటున్నారు. కానీ, ఆయనలో మంత్రిని కాలేకపోతున్నానే.. అనే ఒక నిరుత్సాహం ఆయన మాటల్లో ఎప్పుడూ వి(క)నిపిస్తోందని ఆయనకు దగ్గరగా ఉంటున్న పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఆవేదన చెందుతున్నారు.

మంత్రి కావడానికి ఆయనకెన్నో అర్హతలు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైద్యారోగ్యశాఖ మంత్రిగా, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన హయాంలోనే నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని సాధించారు. తెలంగాణ యూనివర్శిటీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. నలభయ్యేళ్ల సుధీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. వివాదరహితుడిగా పేరున్న సుదర్శన్ రెడ్డికి మంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయి. అన్నిటికీ మించి సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న బంధుత్వం, సాన్నిహిత్యమే తనకు మంత్రి పదవి తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఉన్న సుదర్శన్ రెడ్డి ఇప్పుడున్న పొలిటికల్ ట్రెండ్ కు తగ్గట్టుగా ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొనే వాగ్ధాటి, దూకుడు తత్వం విషయంలోనే కొంత మైనస్ కనిపిస్తోంది. మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న కామారెడ్డికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో మదన్ మోహన్ రావు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ కోటరీతో ఆయన పదవి కోసం లాభియింగ్ చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. జుక్కల్ ఎమ్మెల్యే కూడా తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత విషయంపై ఆశపెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చివరి క్షణంలో కూడా ఏ మార్పయినా జరగొచ్చని విషయమే సుదర్శన్ రెడ్డిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈసారి మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో.. ఏంటో వేచి చూడాల్సిందే.

Next Story