యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి

by Mahesh |
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి
X

దిశ, కామారెడ్డి : యోగా చేయడం తో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యోగా భవనంలో శుక్రవారం ఉదయం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్, పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రపంచంలో ప్రజలు అందరూ ఆరోగ్యంగా, శాంతి, సామరస్యంతో మెలగాలనే లక్ష్యంతో 2014లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించగా అన్ని సభ్య దేశాలు మద్దతు తెలిపాయన్నారు.

నాటి నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వైభవంగా జరుపుకుంటున్నాయన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలంటే యోగా ఉత్తమమైన సాధనమన్నారు. మంచి ఆలోచనలు రావడానికి యోగ ఎంతో దోహదపడుతుందన్నారు. యోగా చేయడం తో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. యోగాతో ఎలాంటి వ్యాధులు దరి చేరవన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలు, కాలేజీ స్థాయిలో కూడా యోగాను పరిచయం చేసి విద్యార్థులు యోగా చేసేలా చూడాలన్నారు. అందులో భాగంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రోటోకాల్ ప్రకారం ఆసనాలు సూక్ష్మవ్యాయామాలు, ప్రాణాయాములు ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కామారెడ్డి పట్టణంలో ఉచితంగా యోగా శిక్షణ ఇచ్చిన గురువులకు ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి. ధర్మానాయక్, పతాంజలి యోగ సమితి అధ్యక్షుడు రామ్ రెడ్డి, యోగా గురువులు అంజయ్య గుప్తా, అనిల్ కుమార్, అంతిరెడ్డి, గంగారెడ్డి, రామ్ చంద్రం, వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story