దళిత విద్యార్థులు చదువుకు పనికిరారా..?

by Sumithra |
దళిత విద్యార్థులు చదువుకు పనికిరారా..?
X

దిశ, నాగిరెడ్డిపేట్ : దళిత విద్యార్థులు చదువుకు పనికిరారా ? దళిత విద్యార్థులు చదువుకోవద్దా..? లేదా తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ చదువుకుంటే నేరమా ? అని ప్రశ్నిస్తున్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద గ్రామానికి చెందిన దళిత విద్యార్థి తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళితే మండలంలోని మాల్ తుమ్మెద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదే గ్రామానికి చెందిన బందెల రవి అనే విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు. కాగా గత కొద్దిరోజులుగా బందెల రవికి జ్వరం రావడంతో పాఠశాలకు గైర్హాజరు అయ్యాడు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బట్టు వెంకట రాజు తాను స్థానికంగా ఉండి చదువు చెపుతున్నాను అన్న విధంగా ప్రవర్తిస్తూ, బందెల రవికి మాత్రం నీకు చదువు రాదు, నీవు ఎక్కడ చదివినా పరీక్షల్లో ఫెయిల్ అవుతావు అంటూ హీనాతి హీనంగా మాట్లాడి బుధవారం పాఠశాలలో రవికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించాడు.

దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన బందెల రవి ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల వద్ద బోరున ఏడ్చాడని రవి తల్లిదండ్రులు తెలిపారు. బందెల రవి రెగ్యులర్ గా పదో తరగతి పరీక్షల్లో పాస్ కాలేవని, ఓపెన్ పదవ తరగతిలో చేరి చదువుకో అంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టీసీ ఇచ్చి పంపించడం ఎంతవరకు సమంజసమని విద్యార్థి తల్లిదండ్రులతో పాటు విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. మాల్ తుమ్మెద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో కూడా విద్యార్థులను తెలుగు మీడియంలోకి ప్రవేశాలకు అనుమతించకుండా, కేవలం ఇంగ్లీష్ మీడియం లోకి మాత్రమే ప్రవేశాలు తీసుకుని విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు కూడా ఈ విద్యా సంవత్సరంలో తెలుగు మీడియం చదివే విద్యార్థులను పాఠశాలలోకి ప్రవేశానికి అనుమతించడం లేదని, అదేవిధంగా ఆ పాఠశాల పూర్తిగా ఇంగ్లీష్ మీడియం మార్చాలని అయినట్లుగా, తెలుగు మీడియంలో చదువుకోవాలని ఆసక్తి కలిగిన విద్యార్థిని, విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించి వెనకకు పంపిస్తున్నారు.

లేదా కొన్ని రోజులు చదివించి నీకు చదువు రాదు, పదవ తరగతి ఓపెన్ పరీక్షలకు హాజరై పరీక్షలు రాయాలి అని టీసీ ఇచ్చి పంపిస్తున్నారు. వాస్తవానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు రెండింటిలో విద్యా బోధన జరగాలి. కానీ మాల్ తుమ్మెద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాత్రం ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థులకు మాత్రమే ప్రత్యేక పాఠశాల అన్నట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తెలుగు మీడియం చదివే విద్యార్థులకు విద్యను అభ్యసించే హక్కు లేదా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రస్తుతం కూడా మాల్ తుమ్మెద గ్రామానికి చెందిన విద్యార్థి బందెల రవికి టీసీ ఇచ్చి పంపించిన మాల్ తుమ్మెద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed