షబ్బీర్ చేతిలో కేసీఆర్ ఓటమి తప్పదు..కాంగ్రెస్ నాయకులు

by Sumithra |   ( Updated:2023-08-22 12:04:08.0  )
షబ్బీర్ చేతిలో కేసీఆర్ ఓటమి తప్పదు..కాంగ్రెస్ నాయకులు
X

దిశ, భిక్కనూరు : గజ్వేలులో ఓటమిపాలవుతానన్న భయంతో, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ ను జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బొందపెట్టి, ఓడించడానికి ప్రజలు కసితో సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. మంగళవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు తిరుపరి భీమ్ రెడ్డిలు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ను స్థానికంగా టికెట్ ఇవ్వకుండా మార్చినందుకా...? లేక సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నందుకా సంబరాలు దేనికోసం జరిపారన్న విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమానికి రాష్ట్రంలో అందరికంటే ముందుగా మద్దతు తెలిపిన, కామారెడ్డి నియోజకవర్గం నుంచే సీఎం కేసీఆర్ తోపాటు, బీ ఆర్ఎస్ పార్టీ పతనం మొదలవుతుందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధి చెందాయని, రాష్ట్రంలో ఉన్న మిగిలిన నియోజకవర్గాలను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. గజ్వేల్ నుంచి రెండుసార్లు పోటీ చేసి గెలిచిన సీఎం కేసీఆర్, నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి వెళ్లలేదని, అందువల్లే అక్కడి ప్రజలు ఓడిస్తారన్న భయంతోనే కామారెడ్డి లో పోటీ చేసేందుకు వస్తున్నాడని, షబ్బీర్ అలీ చేతిలో సీఎం కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మసిబుసి మారడి చేసి, మాయ మాటల తో గారడి చేసే, కేసీఆర్ మాటలను ఎంత మాత్రం నమ్మవద్దని నియోజకవర్గ ప్రజలకు సూచించారు.

ఏదైనా సమస్య వస్తే, సాధక బాధకాలు చెప్పుకోవడానికి, సీఎం వద్దకు వెళ్లే అవకాశం ఉండకపోవడంతో, ఎవరి వద్దకు వెళ్లాలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్థానికంగా ఉండి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే దమ్మున్న మాజీమంత్రిని మహమ్మద్ అలీ షబ్బీర్ ను గెలిపించుకుందా మన్నారు. ఈ సమావేశంలో ఎన్నారై సెల్ జిల్లా కన్వీనర్ చిట్టెడి సుధాకర్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కుంట లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, కంచర్ల ఎంపీటీసీ సభ్యులు మోహన్ రెడ్డి, ఎంపీపీ మాజీ ఉపాధ్యక్షులు తాటిపాముల లింబాద్రి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందె దయాకర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు తాటిపాముల సిద్దా గౌడ్, వడ్ల తిరుమల స్వామి, గజ్జె సురేష్, ధ్యాగల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story