BRS leaders : రైతుల ఆవేదన.. దుఖం కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదు..

by Sumithra |
BRS leaders : రైతుల ఆవేదన.. దుఖం కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదు..
X

దిశ, ఆర్మూర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా మొదటి విడత లక్షలోపు పంట రుణమాఫీ తెల్లరేషన్ కార్డు లేని వారికి రాలేదని ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ ఆర్మూర్ మండల మాజీ అధ్యక్షుడు ఇట్టేడి దేగం లింగారెడ్డి, ఆర్మూర్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు పూజ నరేందర్, నాయకులు పోలా సుధాకర్ లు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తెల్లరేషన్ కార్డు కుటుంబం నిర్దారణకు మాత్రమేనని పాస్ బుక్ ల ఆధారంగా పంట రుణమాఫీ చేస్తామన్నారు. కానీ తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ వచ్చిందని, చిన్న, సన్నకారు రైతులు వారి కుటుంబాలలో కొడుకులకు పెళ్లిళ్లు అయి వేరు కాపురం పెట్టుకుంటే వారికి రేషన్ కార్డు లేక రుణమాఫీ కాలేదన్నారు.

ఒక లక్ష పంట రుణం చిన్న, సన్న కారు (మూడు ఎకరాలలోపు) రైతులకే ఉంటుందని, వారికి వివిధ కారణాల వలన తెల్లరేషన్ కార్డు లేక వారికి రుణమాఫీ జరగలేదు. చిన్న, సన్నకారు రైతులు ఇంటి నిర్మాణాలు చేస్తేనో, ఆ రైతు పిల్లల ఉన్నత విద్య కొరకు బ్యాంకు లోన్ కావాలంటే, వారికి వున్న భూమి అసైన్డ్ భూమి కావడం వల్ల బ్యాంకు వాళ్ళు ఈ భూమి గ్యారంటీకి పనికి రాదని ఐటీ రిటర్న్ దాఖలు పత్రాలు కావాలంటే గత్యంతరం లేక ఎదో చిన్నకిరాణా దుకాణం నడుపుతున్నట్టో ఎదో చిన్నవ్యాపారం చేస్తున్నట్టు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తారన్నారు.

అట్లాంటి చిన్న, సన్నకారు రైతులకు కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినందుకు వారికి రుణ మాఫీ రావడం లేదన్నారు. అదే విధంగా పంటరుణం రెండు లక్షల కంటే ఎక్కువగా వున్న మొత్తాన్ని రైతులు కట్టిన తర్వాతే రుణమాఫీ చేస్తామని నిబంధన పెట్టడం చాల శోచనీయం అన్నారు. పంట పెట్టుబడి అవసరం అయ్యే సమయంలో రైతుబంధు ఇచ్చి ఆదుకోకపోవడం పోయి మీదికెళ్లి రెండు లక్షల పైన ఉన్న మొత్తాన్ని కడితేనే రెండు లక్షల రుణ మాఫీ చేస్తామనడం చాల బాధాకరం అన్నారు. మొదటి విడత లక్షరుణ మాఫీ లిస్ట్ లో పేరు లేని చాలమంది సన్నకారు రైతులు ఆవేదన చెందుతున్నారని. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో పంట ఋణం తీసుకోండి 2 లక్షల వరకు మాఫీ చేస్తా అన్నాడు. ఇప్పుడేమో మాట మార్చి అనేక షరతులు పెట్టి రైతులను మోసం చేస్తున్నాడని అన్నారు. రైతుల ఆవేదన, దుఖం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి మంచిది కాదన్నారు.

పంట ఋణం తీసుకున్న ప్రతి రైతుకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని, అలాగే వర్షాకాలం పంట రైతు బందు కూడా తొందరగా రైతులకు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రైతు నాయకులు మాక్లూర్ మాజీ ఎంపీపీ సుక్కి సుజాత సుధాకర్ , మాజీ ఆర్మూర్ మండల ఉపాధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు గోవింద్ పేట్ ఈ గంగాధర్ పాల్గొన్నారు .

Advertisement

Next Story

Most Viewed