మనబస్తి - మనబడి కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్..

by Sumithra |
మనబస్తి - మనబడి కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్..
X

దిశ, నిజామాబాద్ సిటీ : ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాలని, విద్యార్ధులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ముఖ్యమంత్రి ఆలోచన మేరకు మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని చేపట్టారని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువారం నిజామాబాద్ రూరల్ మండలంలోని గుపన్ పల్లి డివిజన్ 3లో మండల ప్రాథమిక పాఠశాలలో 16 లక్షల 85వేల రూపాయల నిధులతో నిర్మించిన మనబస్తి.. మనబడి మౌలిక వసతుల కల్పన పనుల ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సరైవ సౌకర్యాలు, వసతులు లేని కారణంగానే అనేకమంది విద్యార్ధులను తమ తల్లిదండ్రులు వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమం క్రింద రాష్ట్రంలో 26,065 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 9,123 పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందుకు గాను 7,289 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. ఈ నిధులతో ప్రహారీగోడ నిర్మాణం, టాయిలెట్స్ నిర్మాణం, అభివృద్ధి పనులు, విద్యుత్, త్రాగునీటి సౌకర్యం, ఫర్నిచర్ కొనుగోలు తదితర 12 రకాల అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం దేశానికి 100 లక్షల అప్పు చేసిందని, ఆదానీకి అంబానీకి దేశసంపదను కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటు వారికి అమ్ముతూ దేశాన్ని అప్పుల మయంగా మార్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే చెల్లుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీ నాయకులు నోరు తెరిస్తే అబద్ధం, గల్లీలో ఉండే బీజేపీ నాయకులు కేంద్రం నుండి రూపాయి తెచ్చే ముఖం లేదు కానీ, ప్రొద్దున లేస్తే గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు ప్రజలకు. స్థానికంగా గెలిచిన నిజామాబాద్ ఎంపీ గ్రామానికి ఒక్క రూపాయి అయినా ఇచ్చారని అని ప్రశ్నించారు. సంవత్సరానికి 5 కోట్ల ఎంపీ ఫాండ్ వస్తుంది, నాలుగు సంవత్సరాల నుండి, ఏ ఒక్క గ్రామానికి అయినా రూపాయి ఇచ్చిన ముఖం లేదు అని విమర్శించారు. వైస్ఎంపీపీ అన్నం సాయిలు, డీఈవో దుర్గాప్రసాద్, కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ రామారావు, స్కూల్ హెచ్ఎం రమా, ఎమ్మార్వో అనిల్, ఎస్ఎంసి చైర్మన్ సోనీ, కార్పొరేటర్ అనిల్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మీసాల మధుకర్ రావు, పల్ద సొసైటీ చైర్మన్ జితేందర్, ఏఈ మారుతి,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed