తెలంగాణ వస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారు : స్పీకర్ పోచారం

by Shiva |
తెలంగాణ వస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారు : స్పీకర్ పోచారం
X

దిశ, బాన్సువాడ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కరెంటు వైర్లపై బట్టలు అరేసుకోవాల్సిందేనని ఆంధ్ర నాయకులు ఏద్దేవా చేశారని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సోమవారం బాన్సువాడ పట్టణ శివారులోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో జరిగిన "విద్యుత్ ప్రగతి" కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ప్రజలకు వివరించడానికే దశాబ్ధి అవతరణ ఉత్సవాలని పేర్కొన్నారు.

విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రానిది సక్సెస్ స్టోరీ అని అన్నారు. రాష్ట్రంలో అంధకారం నుంచి వెలుగులోకి వచ్చిందన్నారు. ఆధునిక కాలంలో విద్యుత్తు మానవ జీవితాలతో ముడిపడి ఉందన్నారు. పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని అవసరాలకు కరంట్ అవసరమన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు కరంటే ముఖ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 లో మన సామర్థ్యం 7,778 మెగావాట్ల లోటు 2,700 మెగావాట్లుగా ఉండేదని, సీఎం కేసీఆర్ కృషి, పట్టుదల, ప్రణాళికలతో ఉత్పత్తి సామర్థ్యం 2023 నాటికి 18,567 మెగావాట్లకు చేరుకుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 తరువాత రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థల పటిష్టం, విస్తరణకు రూ.97,321 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. గృహ, వ్యవసాయ రంగాలకు సబ్సిడీలకు రూ.50 వేల కోట్ల ఖర్చు అయిందన్నారు. విద్యుత్ కావలసినంత అందుబాటులో ఉండడంతో గృహాలకు, వ్యవసాయానికి, పారిశ్రామిక రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,196 యూనిట్లు ఉండేదని, నేడు రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2,140 యూనిట్లకు చేరిందన్నారు.

ఇది జాతీయ సగటు 1,255 యూనిట్ల కంటే 70 శాతం అధికమన్నారు. రైతులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయానికి ఉచితంగా కరంటు సరఫరా జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా ఉచిత విద్యుత్ లేదని, పైగా మోటార్లకు మీటర్లు పెట్టారని తెలిపారు. మన రాష్ట్రంలో కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎఫ్.ఆర్.బీ.ఎం కింద ఏటా 6వేల కోట్ల రుణం ఇస్తామని కేంద్రం లెటర్ పంపిందన్నారు. కానీ ఎంత నష్టం వచ్చినా.. మీరు రుణం ఇవ్వకపోయినా పరవాలేదు నేను మాత్రం మోటార్లకు మీటర్లు పెట్టనని కేసీఆర్ దైర్యంగా చెప్పారని తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం 27.49 లక్షల వ్యవసాయ కరంటు మోటార్లు ఉన్నాయన్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కోసం ఏటా 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. అంటే ప్రతి రైతుకు రూ.40 వేల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుందని, బాన్సువాడ నియోజకవర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్లు, సరఫరా కోసం 525 కోట్లు ఖర్చు చేశామన్నారు. దామరచర్లలో రూ.70 కోట్ల రూపాయలతో 220 KV సబ్ స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలో 43 వేల విద్యుత్ మోటార్లు ఉన్నాయని, వీటి కోసం ఏటా సుమారుగా రూ. 170 కోట్ల సబ్సిడీగా ఖర్చు అవుతుందన్నారు.

నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సర్పంచ్ లు ఫోటోలు, వీడియోలు తీసి ప్రజలకు వివరించాలని అన్నారు. గత పది సంవత్సరాల ప్రజా జీవితం నాకు సంతృప్తి ఇచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చానని, కేవలం పొలాలకు వెళ్ళే బాటల కోసం అయిదు కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. అనంతరం విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి స్పీకర్ పోచారం సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్,ఆర్డివో రాజగౌడ్, డిఎస్పీ జగన్నాథ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story