ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి

by Naveena |
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి
X

దిశ, కామారెడ్డి : రబీ 2024-25 సీజనులో వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, వ్యవసాయం, పోలీసు, రవాణా, మార్కెటింగ్, సహకార, తదితర శాఖల అధికారులతో వరి ధాన్యం కొనుగోళ్ల పై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రబీ సీజన్ లో 2,61,110 ఎకరాల్లో రైతులు వరి ధాన్యం సాగు చేసారని, ఇందులో 57,445 ఎకరాలలో సన్నరకం, 2,03,665 ఎకరాలలో దొడ్డు రకం వరి రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు.

ఇందులో 4,88,796 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం , 1,32,121 మెట్రిక్ టన్నుల సన్న రకం వరి ఉత్పత్తి వస్తుందని తెలిపారు. జిల్లాలో వరి కొనుగోళ్లకు 424 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో 27 కేంద్రాలు మహిళా సంఘాలు, 397 కేంద్రాలు పాక్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సన్న రకాల వారి కొనుగోలుకు 63 కేంద్రాలు, 334 కేంద్రాలు దొడ్డు రకం వరి కొనుగోళ్లు చేయనున్నట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్, ఆటోమేటిక్ వరి ధాన్యం శుభ్ర పరచే యంత్రాలు, తేమ కొలిచే యంత్రాలు, తూకం వేసే స్కేల్, పాడి డ్రయ్యేర్స్, గన్నీ సంచులు, తదితర వాటిని అందుబాటులో ఉంచాలని తెలిపారు.

గత ఖరీఫ్ లో ఎదురైనా సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా అవసరమైన ఏర్పాటు, కేంద్రాల పెంపు చేయాలని సూచించారు. ధాన్యం రవాణాలో అంతరాయం కలుగకుండా వాహనాలు సమకూర్చాలని తెలిపారు. మే చివరి వారంలో వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. వాతావరణ పరిస్థితుల వివరాలు రైతులకు వివరించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్ అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed