ఆఫ్ లైన్ లోనే నీట్‌ యూజీ - 2025

by M.Rajitha |   ( Updated:2025-01-30 17:15:18.0  )
ఆఫ్ లైన్ లోనే నీట్‌ యూజీ - 2025
X

దిశ, తెలంగాణ బ్యూరో: నీట్‌ యూజీ 2025 పరీక్షను ఆన్‌లైన్‌ కాకుండా ఆఫ్‌లైన్‌ విధానంలోనే నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పాత విధానంలో 180 ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రంతో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు(3 గంటలు) ఉండనుంది. కేంద్ర విద్య, ఆరోగ్యశాఖల మధ్య సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం చివరకు ఓఎంఆర్‌ పద్ధతిలోనే ఎగ్జామ్ ను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిర్ణయం మేరకు నీట్‌ యూజీ పరీక్ష పెన్‌-పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు. ఒకేరోజు, ఒకే షిఫ్టులో ఈ పరీక్ష ఉంటుందని ఎన్ టీఏ తెలిపింది.

ఆన్‌లైన్‌పై వెనక్కి తగ్గిన ఎన్ టీఏ

దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్‌ యూజీ నిలుస్తోన్న సంగతి తెలిసిందే. నీట్ యూజీ పరీక్షకు గతేడాది 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జేఈఈ మెయిన్‌ తరహాలోనే ఈసారి (2025) కూడా నీట్‌ యూజీని ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని ఎన్‌టీఏ భావిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరి రంగన్‌ ఛైర్మన్‌గా నియమించిన నిపుణుల కమిటీ సైతం ఆన్‌లైన్‌ విధానం (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ - సీబీటీ)లో నీట్‌ నిర్వహించాలని సిఫార్సు చేశారు. అయితే, తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు జరిపిన విస్తృత చర్చల్లో ఓఎంఆర్‌ పద్ధతికే మొగ్గుచూపుతూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రశ్నల ఎంపిక విధానానికి స్వస్తి

నీట్ యూజీ పరీక్షకు సంబంధించి కోవిడ్‌ సమయంలో ప్రవేశపెట్టిన ప్రశ్నల ఎంపిక విధానం తీసివేసినట్లు తెలిపింది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి 45 చొప్పున ప్రశ్నలు, బయాలజీలో నుంచి 90 ప్రశ్నలకు 3 గంటల్లో పరీక్షను రాయాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో పెన్‌-పేపర్‌ ఓఎంఆర్ విధానంలో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. నీట్‌ ఫలితాల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు.. నేషనల్‌ కమిషన్ ఫర్‌ హోమియోపతి కింద బీహెచ్‌ఎంఎస్‌ కోర్సులో ప్రవేశాలు చేపడతారు. దీంతోపాటు ఆర్మ్‌డ్‌ మెడికల్‌ సర్వీస్‌ హాస్పిటల్స్‌లో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలకు నీట్ యూజీలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇక నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుకు కూడా నీట్‌ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది.

Next Story

Most Viewed