పేరుకే పెద్ద ఆసుపత్రి.. సర్జన్లులేని 30 పడకల ఆసుపత్రి..

by Sumithra |
పేరుకే పెద్ద ఆసుపత్రి.. సర్జన్లులేని 30 పడకల ఆసుపత్రి..
X

దిశ, మర్రిగూడ : మర్రిగూడెం మండల కేంద్రంలో ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన 30 పడకల ఆసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రిగా ఉంది. ఆస్పత్రి ప్రారంభించి ఆరు నెలలు అవుతున్నప్పటికీ 30 పడకల ఆసుపత్రికి కావాల్సిన వైద్యసిబ్బందిని నేటికీ భర్తీ చేయకపోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనంగా కనపడుతుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జనవరి 3న అట్టహాసంగా ప్రారంభించిన మర్రిగూడ 30 పడకల ఆసుపత్రి వైద్యులు లేక రోగులు ఇక్కడి ప్రజలు సరైన వైద్యం అందక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రారంభం రోజున 8 మంది డాక్టర్లను మర్రిగూడ ఆసుపత్రికి రిక్రూట్ చేశానని మంత్రి సభాముఖంగా డాక్టర్లను పరిచయం చేశారు. కానీ వారంతా కొత్తవారు కేవలం ఎంబీబీఎస్ పట్టా ఉన్నవారే. ఆ 8మంది డాక్టర్లు కూడా డిప్యూటేషన్ పై వచ్చినవారే. ఆ మరుసటి రోజు నుండే ఆసుపత్రిలో డాక్టర్లు మాయం.

గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న సిబ్బంది మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. 30 పడకల ఆసుపత్రి ప్రారంభమైన నాటి నుండి ప్రజలకు పట్టణాలలో ఉండే ఆసుపత్రిలో ఎలాంటి చికిత్సలు జరుగుతాయో ఇక్కడ కూడా అలాంటి వైద్య సదుపాయం చికిత్సలు జరుగుతాయని మంత్రి మాటలకు ప్రస్తుతం జరుగుతున్న చేతలకు ఎలాంటి పొంతన లేదు. దీంతో ఇక్కడి ప్రజలు ఆసుపత్రికి వచ్చిన రోగులు మంత్రి పై ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారు. పగటిపూట రాత్రిపూట ఏమైనా ఎమర్జెన్సీ కేసులు వస్తే ఇక్కడి సిబ్బంది వెంటనే హైదరాబాద్ నల్గొండకు రెఫర్ చేస్తున్నారు. ఇదేమని రోగులు ప్రశ్నిస్తే ఇక్కడ సర్జన్లు లేరు, ఆక్సిజన్ లేదు కాబట్టి పట్టణాలకు వెళ్లాల్సిందేనని లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెప్పడం గమనార్హం.

30 పడకల ఆసుపత్రిలో సర్జన్లు తప్పనిసరి..

30 పడకల ప్రభుత్వాసుపత్రిని ఏర్పాటు చేసేటప్పుడు తప్పనిసరిగా శస్త్ర చికిత్సలు చేసే సర్జన్లు ఉండాలి. ఒక అనస్తీసియా డాక్టరు, గైనకాలజిస్టు, చిల్డ్రన్ స్పెషలిస్టు, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ డాక్టర్లు తప్పనిసరిగా ప్రభుత్వం రిక్రూట్ చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రి ప్రారంభానికి ముందు నల్గొండ ఆసుపత్రి నుండి ఒక ఆప్తమాలజీ డాక్టర్ను డిప్యూటేషన్ మీద మర్రిగూడకు వేశారు. మంత్రి ప్రారంభించిన మూడో రోజు ఆ డిప్యూటేషన్ డాక్టర్ ను డిప్యూటేషన్ క్యాన్సల్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

మంత్రి పరిచయం చేసిన డాక్టర్లంతా ఎంబీబీఎస్ వారే..

మర్రిగూడ 30పడకల ఆసుపత్రిని ప్రారంభించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందిని నియమించే ఉత్తర్వులు నేటికీ జారీ చేయకపోవడం విడ్డూరంగా ఉంది. మర్రిగూడ 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించి 8 మంది డాక్టర్లను మర్రిగూడకు రిక్రూట్ చేశామని సభాముఖంగా పరిచయం చేశారు. సుమారు ఐదు రోజుల తరువాత ఈ ఒక్క డాక్టరు ఆసుపత్రిలో లేరు. ప్రస్తుతం మర్రిగూడ ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యాసుపత్రి సేవలే రోగులకు అందుతున్నాయి. ఆసుపత్రి ప్రారంభించక ముందు ఔట్ పేషంటు రోజువారీగా సుమారు నాలుగు ఐదు వందల వరకు ఉండే కానీ ప్రస్తుతం ఔట్ పేషెంట్ సంఖ్య సగానికి పడిపోయింది. అంటే రోగులకు 30 పడకల ఆసుపత్రి సేవలు ఏ రకంగా అందుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 30 పడకల ఆసుపత్రి భవనం తప్ప అందులో పనిచేసే వైద్య సిబ్బందిని ప్రభుత్వం రిక్రూట్ చేయకపోవడం రోగులకు ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు ప్రభుత్వపరంగా అందడం లేదు.

మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య సిబ్బంది రిక్రూట్ ఉత్తర్వులు జారీ ఎక్కడ..?

ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించిన మర్రిగూడ 30 పడకల ఆసుపత్రికి వైద్యసిబ్బంది రిక్రూట్ ఉత్తర్వులు ప్రభుత్వం నేటికీ జారీ చేయకపోవడం గమనార్హం. ఆసుపత్రి ప్రారంభం మామా అనిపించిన మంత్రి ఆరునెలలు దాటిన రిక్రూట్ ఉత్తర్వులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యసేవలే రోగులకు అందుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా 30 పడకల ఆసుపత్రి స్టాఫ్ ను నియమించి ఇక్కడి ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

సూపరింటెండెంట్ డిప్యూటేషన్..

కట్టంగూరు మండల వైద్యాధికారి రాజేష్ మర్రిగూడ 30 పడకల ఆసుపత్రికి సూపరిండెంట్ గా చలామణి అవుతున్నారు. డాక్టర్ రాజేష్ బై ఎలక్షన్ ముందే కట్టంగూరుకు బదిలీ అయ్యారు. కానీ అతనే మర్రిగూడ సూపరిండెంట్ గా కొనసాగుతున్నారు. ఆసుపత్రిలో సూపరిండెంట్ ఎవరు రోజువారిగా ఎవరు విధులు నిర్వహిస్తున్నారు. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఆసుపత్రిలో నెలకొని ఉంది.

ఎమర్జెన్సీ కేసులు పట్టణాలకు తరలింపు..

మర్రిగూడ 30 పడకల ఆసుపత్రికి వచ్చిన ఎమర్జెన్సీ కేసులు సర్జన్లు లేకపోవడం సరియైన సదుపాయం లేకపోవడంతో ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు హైదరాబాదుకు నల్గొండకు రెఫర్ చేస్తూ ఉన్నారు. దీంతో రోగులు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద ఆసుపత్రి అని వైద్యానికి వస్తే పెద్ద డాక్టర్లు లేరు అని ఇక్కడ పనిచేసే వారంతా ఎంబీబీఎస్ డాక్టర్ లేనని రిఫర్ చేస్తున్నడంతో రోగులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.

Advertisement

Next Story