- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నత్తనడకన ఎల్ఆర్ఎస్.. వెబ్ సైట్‌లో అనేక సమస్యలు

దిశ,సూర్యాపేట : అనధికార లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో ఆనందోత్సాహాల్లో మునిగి తేలిన వినియోగదారులు ప్రస్తుతం అష్టకష్టాలు పడుతున్నారు. ఎల్ఆర్ఎస్ విధివిధానాలు రూపొందించిన ప్రభుత్వం సంబంధిత వెబ్ సైట్‌లో సమస్యలు నివారించకపోవడంతో రిజిస్ట్రేషన్లకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. 2020 చట్టం ప్రకారం నిబంధనలను అనుసరించి ఏర్పాటు చేసిన వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి నివ్వగా గత నెల 20న జీవో నెంబర్ 28ని కూడా విడుదల చేసింది.
దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఆనందం వెల్లివిరియగా, నాలుగేళ్ల అనంతరం ఇక రిజిస్ట్రేషన్లు అవుతాయనే భావనలో ఉన్నారు. తీరా వెబ్ సైట్ నెలకొన్న సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వారంతా నిరాశా నిస్పృహలకు గురవుతున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లు, రిజిస్ట్రేషన్లు లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020 సెప్టెంబర్ 1న అప్పటి ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఇందులో భాగంగా 26 ఆగస్టు 2020 లోపు సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన లేఅవుట్ యజమానులు, ప్లాట్ల ఓనర్లకు ఎల్ఆర్ఎస్ అవకాశం కల్పించింది. అందులోని లే అవుట్ నిబంధనలను సవరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సైట్‌లో సమస్యలతో జాప్యం..
సవరణలతో ఎల్ఆర్ఎస్‌ను ప్రకటించిన ప్రభుత్వం దానికి ప్రత్యేకంగా వెబ్ సైట్‌ను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆ వెబ్ సైట్‌లో నెలకొన్న సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్లకు తీవ్ర ఆటంకం ఎదురవుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్-2020 ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది వినియోగదారులు నిర్ణీత ఫీజు చెల్లించారు. ఒక్క ఫ్లాట్ అయితే రూ.వెయ్యి, వెంచర్ అయితే రూ.10 వేల చొప్పున ఫీజు నిర్ణయించగా రిజిస్ట్రేషన్లకు ఆసక్తిగల వినియోగదారులు పెద్ద సంఖ్యలో అప్పట్లో చెల్లించారు. ఒక్క సూర్యాపేట మున్సిపల్‌కు సంబంధించినవే వేలల్లో దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి.
దాదాపు నాలుగేళ్లు గడిచిన తర్వాత మళ్లీ ఎల్ఆర్ఎస్ తెరపైకి రావడంతో తాము చెల్లించిన ఫీజు తిరిగి వినియోగంలోకి వస్తుందని రియల్టర్లు, వినియోగదారులు సంతోషించారు. అయితే ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్‌లో నెలకొన్న సమస్యల కారణంగా గతంలో చెల్లించిన ఫీజులు ఏవీ కూడా కనిపించకపోవడంతో సబ్ రిజిస్ట్రార్లు సంబంధిత ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు అంగీకరించడం లేదు. దీంతో గతంలో చెల్లించిన ఫీజులన్నీ వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో అత్యవసరం ఉన్న వారు మళ్లీ ఫీజులు చెల్లించి రిజిస్టేషన్లు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా కొత్తగా ఆన్ లైన్‌లో చెల్లించిన ఫీజు కూడా సైట్‌లో చూపించకపోవడంతో రిజిస్ట్రేషన్ పక్రియ నత్తనడకన కొనసాగుతోంది.
సమీపిస్తున్న రాయితీ గడువు..
ఎల్ఆర్ఎస్ విధివిధానాలు రూపొందించిన ప్రభుత్వం మార్చి 31లోపు నిర్ణీత క్రమబద్ధీకరణ చార్జీలు, ఓపెన్ స్పేస్ కంట్రిబ్యూషన్ చార్జీలు చెల్లించిన పక్షంలో సంబంధిత ఫీజుల్లో వన్ టైం సెటిల్మెంట్ కింద రూ.25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన మేరకు పెద్ద మొత్తంలో ఆదా అవుతుండడంతో గడువులోపు దరఖాస్తు చేసేందుకు పెద్ద సంఖ్యలో వినియోగదారులు సబ్ రిజిస్ట్రార్, మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే వెబ్ సైట్‌లో తలెత్తిన సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరగక పోగా ఈ నెల 31తో రాయితీ గడువు ముగుస్తుంది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మేరకు రాయితీ పొందే అవకాశం వినియోగదారులు కోల్పోయే అవకాశం ఉంది.
ఎల్ఆర్ఎస్‌ను వినియోగించుకోవాలి : బి.శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట
ఎల్ఆర్ఎస్‌కు ప్రభుత్వం 25శాతం రాయితీ ఇచ్చింది. ఈ నెల 31తో ఎల్ఆర్ఎస్ గడువు ముగుస్తుంది. వెబ్ సైట్‌లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. ఎల్ఆర్ఎస్ కోసం ప్రత్యేక యాప్‌ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. మున్సిపాలిటీలో ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేశాం. సెలవు దినాలలో కూడా ఎల్ఆర్ఎస్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్‌ను వినియోగించుకోవాలి.