వరుస దొంగతనాలతో.. వణుకుతున్న జనం..

by Sumithra |
వరుస దొంగతనాలతో.. వణుకుతున్న జనం..
X

దిశ, కోదాడ : వరుస దొంగతనాలతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఏం జరుగుతుందోనని.. వరుస దొంగతనాలు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసుల నిఘా పై ప్రజలు ఒక్కింత ఆందోళన చెందుతున్నారు. మూడు, నాలుగు ఇండ్లలోని వారు కలిసి ఒక కెమెరా ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. కానీ ప్రధాన కూడళ్ల వద్ద గతంలో ఉన్న కెమెరాలు పనిచేయకపోయినా పట్టించుకునే వారు మాత్రం లేరు.

తాళం వేసి వున్న ఇంట్లో చోరీ..

శుక్రవారం ఒక దొంగతనం వెలుగులోకి రాగా, శనివారం మరో ఇంట్లో జరిగిన దొంగతనం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీమన్నారాయణ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా వున్నాయి. కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన ఎంఎల్ నరసింహా రావు గతంలో రెవెన్యూ శాఖలో డిప్యూటీ ఎంఆర్వోగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయన కుటుంబ సభ్యుల హాస్పిటల్ పని నిమిత్తం 15 రోజుల క్రితం తమ ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఆ ఇంటికి తాళం వేసి వుండటాన్ని గమనించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంటిలోకి చొరబడి కబోర్డ్స్ , తలుపులు పగలగొట్టి బీరువాలో నగలు దొంగిలించారు.

శనివారం చుట్టుపక్కల వారు ఇంటి తాళాలు పగులగొట్టి వుండటాన్ని గమనించి నరసింహారావు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీనితో వారు ఇంటికి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటనలో ఇంట్లో ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి అపహరణకు గురైనట్లుగా గుర్తించారు. వాటి విలువ పదిహేను లక్షల రూపాయల ఉటుందని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కోదాడ పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ఈ సంఘటన పై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.


Next Story