ఆర్ఆర్ఆర్ టెండర్ లో వేల కోట్ల కుంభకోణం : గూడూరు నారాయణరెడ్డి

by Sumithra |
ఆర్ఆర్ఆర్ టెండర్ లో వేల కోట్ల కుంభకోణం : గూడూరు నారాయణరెడ్డి
X

దిశ, భూదాన్ పోచంపల్లి : ఆర్ఆర్అర్ టెండర్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం వేలకోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు చేనేత దీక్షలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు గూడూరు నారాయణరెడ్డి ఆరోపించారు. మున్సిపల్ కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద శుక్రవారం చేనేత జనసమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన చేనేత కార్మికుల సమస్యల పై దీక్షకార్యక్రమంలో సంఘీభావం తెలపటానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యల పై ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమం పేరిట ప్రభుత్వ ఆస్తులను అమ్ముకొని మొత్తం కుటుంబం కుంభకోణంలో మునిగిపోతుందని ప్రజాసమస్యలను పక్కనపెట్టి కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ఓట్ బ్యాంకు రాజకీయాలు చేస్తుందని ఇలాంటి నియంతృత్వ పాలన తుదముట్టించాలని ఆయన అన్నారు.

చేనేత కార్మికుల కోసం చేనేత పరిశ్రమ బావుండడం కోసం కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడీ ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టినప్పటికీ కేసీఆర్ వాటిని క్షేత్రస్థాయిలో చేరకుండా చూస్తున్నారని మండిపడ్డారు. చేనేత కార్మికులకు చేనేత బంధును ఇవ్వాలని, చేనేతలకు ఇప్పుడున్న కూలీ పై నాలుగు వేల రూపాయలు పెంచాలని, ఇళ్లు లేని ప్రతిచేనేత కుటుంబాలను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, సహకార సంఘం ఎన్నికలను నిర్వహించి సంఘాలను బలోపేతం చేయాలని, జియోట్యాగ్ కలిగిన చేనేత కళాకారులకు వయస్సుతో నిమిత్తం లేకుండా రూ.5 లక్షల భీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులకు రూ1.50 లక్షలు కాకుండా రూ.5 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని బీజేపీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి తనస్వంత వ్యాపారాలు తప్ప చేనేతల సమస్యలు పట్టించుకోలేదని, ప్రజాసమస్యల పై అసెంబ్లీలో ఏనాడూ కూడా మాట్లాడలేని ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఉన్న ఒక్కటే లేకున్న ఒక్కటేనని అన్నారు. చేనేతల సమస్యలపై వారితో కలిసి పోరాడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జనసమాఖ్య రాష్ట్ర నాయకులు చింతకింది రమేష్, సభాద్యక్షులు కర్నాటి పురుషోత్తం, గౌరవ అధ్యక్షులు వేశాల మురళి, పద్మశాలి కార్మిక సంఘం అధ్యక్షురాలు మెరుగు శశి కళ, బీజేపీ నాయకులు గంజి బస్వాలింగం, సంఘం మాజీ అధ్యక్షులు భారత వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story