తెలంగాణ చేనేతలకు MLC ఎల్.రమణ కీలక పిలుపు

by Disha Web Desk 2 |
తెలంగాణ చేనేతలకు MLC ఎల్.రమణ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ ఎల్.రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేతన్నల ఆత్మహత్యలు మళ్లీ మొదలు అయ్యాయని ఆవేదన చెందారు. నేతన్నలకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు.. కానీ ఇప్పుడు వాటి ప్రస్తావన ఎక్కడా తేవట్లేదు అని అన్నారు. చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడానికి రేవంత్ రెడ్డి సర్కారే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వస్త్ర పరిశ్రమపై వున్న జీఎస్టీ ఎత్తివేస్తామని చెప్పారు. కానీ, ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.50 వేల రుణం ఇచ్చారని గుర్తుచేశారు.

దసరా, బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు ఇవ్వడం ద్వారా చేనేతలకు అండగా నిలబడ్డారని చెప్పారు. చేనేతలకు నెలకు రూ.2 వేల పింఛన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. నేతన్న బీమా ద్వారా చేనేతల కుటుంబానికి రూ. 5 లక్షల సాయం చేశారని అన్నారు. గత నవంబర్ నుండే నేతన్నలకు రాష్ట్రంలో పనిలేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్సీగా తాను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి చేనేతల సమస్యలను తీసుకువెళ్ళానని అన్నారు. చేతి వృత్తులను కాపాడలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డి బీసీలను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. ఆయనకు ఏ వర్గాలు అంటే ప్రేమో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం లోపించిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో నేతలన్నలంతా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కోరారు.



Next Story

Most Viewed