కేసీఆర్ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించా.. కుండబద్దలు కొట్టిన ఎమ్మెల్సీ కోదండరాం

by Gantepaka Srikanth |
కేసీఆర్ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించా.. కుండబద్దలు కొట్టిన ఎమ్మెల్సీ కోదండరాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రుణమాఫీని జీర్ణించుకోలేకనే రాష్ట్ర ప్రభుత్వంపైనా, కాంగ్రెస్‌పైనా బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం.. రైతుల్లో గందరగోళం రేకెత్తించి వారిలో కొత్త సందేహాలను పుట్టిస్తున్నారని ఆరోపించారు. రైతుల్ని రెచ్చగొట్టి ధర్నాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మూడు విడతల్లో రుణమాఫీతో మెజారిటీ రైతులకు ప్రయోజనం కలిగిందని, కొద్దిమందికి టెక్నికల్ కారణాలతో బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదన్నారు. ఈ విషయమై ఇప్పటికే డిప్యూటీ సీఎం, వ్యవసాయ మంత్రి సహా పలువురు మంత్రులు క్లారిటీ ఇచ్చారని, అర్హులైన రైతులందరికీ అందించనున్నట్లు ప్రభుత్వం కూడా స్పష్టమైన ప్రకటన చేసిందన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. రైతులకు ప్రయోజనం చేకూరాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం 26 రోజుల వ్యవధిలోనే రుణమాఫీని అమలు చేసిందని, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నదన్నారు.

కార్పొరేట్ కంపెనీలకు రుణమాఫీ చేస్తే అభ్యంతరం చెప్పని పలువురు లీడర్లు ఇప్పుడు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీపై రాద్ధాంతం చేస్తున్నారని ప్రొ. కోదండరాం ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలతో పోలిస్తే తెలంగాణలోనే రైతులకు మాఫీ చేసేది చాలా తక్కువేనని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రభుత్వానికి సహకరిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని గుర్తు చేసిన ఆయన... ధనిక రాష్ట్రమంటూ ఇంతకాలం ఊదరగొట్టిన బీఆర్ఎస్ చివరకు కొత్త ప్రభుత్వానికి చిప్ప చేతిలో పెట్టి పోయిందని విమర్శించారు. ‘హైడ్రా’ గురించి వ్యాఖ్యానిస్తూ... నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న కట్టడాలకు గత ప్రభుత్వం పర్మిషన్ ఎందుకు ఇచ్చిందని ఎదురు ప్రశ్నించారు. ఇప్పుడు ఆ ఉల్లంఘనలను ప్రస్తావించి కూల్చడానికి హైడ్రా సిద్ధపడితే బీఆర్ఎస్ లీడర్లకు ఎందుకు భయం పట్టుకున్నదన్నారు.

ఆనాడు ఉల్లంఘనలకు పాల్పడినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఎలా ఇవ్వాల్సి వచ్చిందని కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. చట్టాన్ని అమలు చేయడంలో భాగంగా హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలను బీఆర్ఎస్ నేతలు ఎందుకు తప్పుపడుతున్నారని నిలదీశారు. అప్పటి పర్మిషన్లపై ఏం సమాధానం చెప్తారని అన్నారు. హైడ్రా విషయంలో మినహాయింపు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నేతలు విచిత్ర వాదనను తెరమీదకు తెస్తున్నారని, కొద్దిమంది కోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో చెరువులు ఎలా నాశనమయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహం విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ... ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామంటూ కేటీఆర్ ఇప్పుడు చెప్తున్నారుగానీ... పదేండ్ల కాలంలో తెలంగాణ తల్లి విగ్రహంపై ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల పేరుతో బయటకి వచ్చేవాళ్లు నిష్పక్షపాతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వంలో లోక్‌సభకు పోటీ చేయాల్సిందిగా కేసీఆర్ నుంచి ఆఫర్ వచ్చింది నిజమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పిన ప్రొ. కోదండరాం... ఉద్యమకారులను గుర్తించనందుకు నిరసనగా ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు బదులిచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశాన్ని స్వీకరించడంపై స్పందిస్తూ... ఉద్యమకారులకు ఇచ్చిన గుర్తింపుగానే భావిస్తున్నానని అన్నారు. వ్యక్తిగత సెక్యూరిటీని వద్దనడానికి కూడా నిర్దిష్టమైన కారణం ఉన్నదని, ప్రజలతో సంబంధాలు దెబ్బతింటాయని, అందువల్లనే ప్రజల మనిషిగా తనకు అలాంటి గన్‌మెన్ భద్రత వద్దని ప్రభుత్వానికి వివరించినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed