Sridhar Babu: పార్టీ కోసం పోలీసులను వాడుకున్నారు.. బీఆర్ఎస్ పై శ్రీధర్ బాబు విమర్శలు

by Prasad Jukanti |   ( Updated:2024-10-21 13:23:19.0  )
Sridhar Babu: పార్టీ కోసం పోలీసులను వాడుకున్నారు.. బీఆర్ఎస్ పై శ్రీధర్ బాబు విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారి పోలీసుల కుటుంబాల సంక్షేమాన్ని ఆలోచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అందులో భాగంగానే ఇవాళ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. గత ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో పోలీసులను తమ పార్టీ ప్రయోజనాల కోసం ఉపోయోగించుకుని వారి సంక్షేమం గురించి మాత్రం ఆలోచన చేయలేదని విమర్శించారు. నిర్విరామంలో ప్రజలకు సేవ చేస్తున్న పోలీసులకు ప్రభుత్వం తరపున అభినందనలు తెలుపుతున్నానన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీధర్ బాబు మాట్లాడారు. రాష్ట్రంలోని యువత కోసం తొలుత యంగ్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు శంకుస్థాపన మొదలు పెట్టాం. ఇవాళ పోలీసుల పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించేలా ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇటువంటి పాఠశాలలు దేశంలోనే ఎక్కడ లేవన్నారు. రాబోయే కాలంలో ఈ స్కూల్ ఓ ఆదర్శవంతంగా నిలవాలని ఆకాంక్షించారు. కేవలం చదువులకే పరిమితం కాకుండా క్రీడలు, మానసిక వికాసంలోనూ సత్తాచాటేలా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించామన్నారు. గత ప్రభుత్వం గ్రూప్-1 పరీక్ష నిర్వహించలేకపోయిందని కానీ మేము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed