పాలమూరులో మోడీ చెప్పింది పచ్చి అబద్ధం: ప్రధాని వ్యాఖ్యలకు KTR స్ట్రాంగ్ కౌంటర్

by Satheesh |   ( Updated:2023-10-01 12:59:40.0  )
పాలమూరులో మోడీ చెప్పింది పచ్చి అబద్ధం: ప్రధాని వ్యాఖ్యలకు KTR స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సర్కార్ రైతు రుణమాఫీ హామీని విస్మరించిందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ హామీని విమర్శించిందని పాలమూరు సభలో ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. కరోనా కష్టమొచ్చిన రుణమాఫీ చేశామని తెలిపారు. రూ.37 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. రైతు రుణమాఫీపై ప్రధాని మోడీ తన వ్యాఖ్యలను ఉపసంహరించకోవాలని డిమాండ్ చేశారు. ఇక, కుటుంబ పార్టీ అంటూ మోడీ చేసిన కామెంట్స్‌కు సైతం కేటీఆర్ రిప్లై ఇచ్చారు. అవును తమది కుటుంబ పార్టీయేనని.. తెలంగాణ ప్రజలంతా మా కుటుంబమేనన్నారు. తెలంగాణలోని ప్రతి కుటుంబంలో కేసీఆర్ సభ్యుడు అన్నారు.

‘‘నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు కాదు.. జాతీయస్థాయిలో అధికార మార్పు కావాలని కోరుతోంది దేశ ప్రజలు. BRS పార్టీ స్టీరింగ్ కేసీఆర్ గారి చేతిలోనే పదిలంగా ఉంది. కానీ బీజేపీ స్టీరింగ్.. అదాని చేతిలోకి వెళ్లిపోయింది. మీరు కిసాన్ సమాన్ కింద ఇచ్చింది కేవలం నామమాత్రం.. కానీ, ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ 70 లక్షల మంది రైతులకు 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన విషయం మీరు తెలుసుకుంటే మంచిది. రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం.. మిలియన్ డాలర్ జోక్.

స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక కొత్త రాష్ట్రం రెండుసార్లు రైతుల రుణమాఫీకి నడుం బిగించిన ఏకైక సందర్భం తెలంగాణలోనే ఆవిష్కృతమైంది. అన్నదాత అప్పులు మాఫీ చేసిన జైకిసాన్ ప్రభుత్వం మాది..! కార్పొరేట్ దోస్తులకు 14.5 లక్షల కోట్ల రుణాలను రద్దుచేసిన.. నై కిసాన్ సర్కారు మీది.! కర్షకుల రక్తం కండ్ల జూసిన రైతుహంతక రాజ్యం మీది..!

పదేళ్లపాటు విభజన హామీలను పాతరేసి.. మీ ఎన్నికల హామీలను గాలికి వదిలేసి ఓట్ల వేటలో ఇప్పుడొచ్చి మాట్లాడితే నమ్మేదేవరు. ప్రాజెక్టులు వల్ల చుక్క నీరు రాలేదనడం.. మీ అవివేకానికి నిదర్శనం. తెలంగాణలో సాగుతోంది సాగునీటి విప్లవం.. తెలంగాణ రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన మీరా మాట్లాడేది.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనమంటే నూకలు తినమన్న మీ కేంద్ర పెద్దల అవమానకర మాటలు తెలంగాణ రైతులు మరిచిపోలేదు. మీరు ఎన్ని చెప్పినా.. మీ బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి.

నిన్న కాళేశ్వరం అయినా.. నేడు పాలమూరు ప్రాజెక్టు అయినా.. ప్రపంచ సాగునీటి చరిత్రలోనే అతి గొప్ప మానవ నిర్మిత అద్భుతాలు. భవిష్యత్తు ఇరిగేషన్ రంగానికే సరికొత్త పాఠాలు. వీటిపై మీ ఆరోపణలు.. పూర్తిగా అవాస్తవాలు. ఇయ్యాల.. మోడీ వచ్చి బీఆర్ఎస్‌ది కుటుంబ పార్టీ అని అన్నడట..! అవును మాది.. బరాబర్ పక్కా కుటుంబ పార్టీయే..! నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే..! మా నాయకుడు కేసీఆర్ గారే కుటుంబపెద్ద..!

తెలంగాణే నా సొంత కుటుంబం అనుకున్నడు కాబట్టే.. ఇంటికి పెద్దకొడుకై.. అవ్వలకు ఆసరాగా నిలిచి రెండు వేల పెన్షన్ అందిస్తున్నడు..! కంటి చూపు మసకబారి.. జారి కిందపడి కాలో.. చేయో విరిగి మంచానపడే కష్టం రాకూడదని పెద్దమ్మలకు.. పెద్దయ్యలకు కంటి పరీక్షలు చేసి కళ్లజోడు అందిస్తున్నడు..! మేనమామై.. లక్ష నూటపదహార్ల కానుకిచ్చి లక్షణంగా లగ్గం చేస్తున్నడు..! అక్కా చెల్లెళ్లు బిందెలు పట్టుకొని నీళ్ల కోసం మైళ్ల దూరం నడిచే కష్టం తీర్చాలని ఇంటింటికి నల్లాపెట్టి నీళ్లు ఇచ్చిండు..! అన్నలాగా.. ఆడబిడ్డకు పుట్టింటి ప్రేమతో పురుడుపోసి కేసీఆర్ కిట్‌ను అందిస్తున్నడు..! గురుకులాలు పెట్టి.. జిల్లాకో మెడికల్ కాలేజీ కట్టి డాక్టర్లు.. ఇంజనీర్లు కావాలన్న పిల్లల కలల్ని నిజం చేస్తున్నడు..! కుటుంబంపైన ఆపేక్ష.. ప్రేమ వుంది కాబట్టే ఒక రైతుబంధు.. రైతుబీమా.. దళితబంధు ఎన్నో మానవీయ పథకాలు రూపుదిద్దుకున్నాయి..!

గిరిజన వర్శిటీ తెలంగాణ హక్కు..! తొమ్మిదిన్నర ఏండ్లు తొక్కిపెట్టి.. విభజన చట్టంలోని హామీని తుంగలో తొక్కి.. ఆదివాసి పిల్లలకు అన్యాయం చేసి.. ఇప్పుడేదో ఉద్ధరించినట్టుగా ఫోజులు కొడుతున్నడు..! అన్నదాత అప్పులు మాఫీ చేసి జైకిసాన్ ప్రభుత్వం మాది..! కార్పొరేట్ దోస్తులకు 14 లక్షల కోట్ల రుణాలను రద్దుచేసిన.. నై కిసాన్ సర్కారు మీది.! కర్షకుల రక్తం కండ్ల జూసిన రైతుహంతక రాజ్యం మీది..!’’ అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed