కేఎల్ యూనివర్సిటీ భూకబ్జాపై చర్యలు తీసుకోండి.. కలెక్టరేట్‌లో ఫిర్యాదు

by Disha Web Desk 23 |
కేఎల్ యూనివర్సిటీ భూకబ్జాపై చర్యలు తీసుకోండి.. కలెక్టరేట్‌లో ఫిర్యాదు
X

దిశ,మేడ్చల్ బ్యూరో: యూనివర్సిటీ పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించి కబ్జా యత్నం చేస్తున్న సంస్థపై చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో కేఎల్ యూనివర్సిటీ కి భూమి ఉన్నది. ఆ భూమిలో కొద్ది భాగమైన భూమి గాజులరామారం గ్రామం సర్వేనెంబర్ 354 లో 15 ఎకరాల 30 గుంటల భూమి ఉన్నది. ఇది ప్రభుత్వ భూమి మీద రికార్డుల్లో ఉండగా ఇందులో ఐదు ఎకరాల భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనంలోకి తీసుకోవటమే కాకుండా నిర్మాణ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ నిర్మాణాలను ఆపి వేసి భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా తెలంగాణ ఉద్యమకారుడు మహమ్మద్ రషీద్ ఫిర్యాదు పత్రములో కోరారు.

కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు..

సర్వేనెంబర్ 354 లో 15 ఎకరాల 30 గుంటలు ఉన్నది. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి. ఈ భూమిలో ఐదు ఎకరాల స్థలాన్ని కేఎల్ యూనివర్సిటీ కి రెగ్యులరైజ్ చేయాల్సిందిగా పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. 2021, 2022, 2023 లో పలుమార్లు ఈ విషయమై అర్జీ చేసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ విషయంలో అధికారులు కే ఎల్ యూనివర్సిటీ ఆక్యుపేషన్ లో ఉన్న భూమిని డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు 2023 ఆగస్టు నెలలో కోర్ట్ ఆర్డర్ కూడా తెచ్చుకుంది. అయితే కోర్టు ఆర్డర్లో కేఎల్ యూనివర్సిటీ ఆక్యుపేషన్ లో ఉన్న భూమి విషయంలో చట్ట ప్రకారం చర్యలు కోవాల్సిందిగా రెవెన్యూ అధికారులకు సైతం సూచించింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని చట్ట ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు తగు చర్యలు తీసుకోకుండా కేఎల్ యూనివర్సిటీ కి పూర్తిగా సహకరిస్తున్నారు అంటూ ఫిర్యాదు దారుడు ఆరోపిస్తున్నాడు.

Next Story

Most Viewed