కేవీఎస్ కన్వెన్షన్, తత్వ స్కూల్ ఆక్రమణలపై చర్యలు తీసుకోండి

by Sridhar Babu |
కేవీఎస్ కన్వెన్షన్, తత్వ స్కూల్ ఆక్రమణలపై చర్యలు తీసుకోండి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేసిన కేవీఎస్ కన్వెన్షన్ హాల్, తత్వ గ్లోబల్ స్కూల్ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా నిజాంపేట కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మండల కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావుకు ఫిర్యాదు చేశారు. గాజులరామారం సర్వేనెంబర్ 11, 12, 13, 127 ప్రభుత్వ భూములను సర్వే చేసి అందులో ఉన్న నిర్మాణాలను తొలగించాలని, వాటిని ప్రజా అవసరాలకు ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరారు.

సహకరించిన వారిపై చర్యలు తీసుకోండి

ప్రభుత్వ భూములు అయిన సర్వేనెంబర్ 11, 12, 13, 127 లలో భారీ కన్వెన్షన్ హాల్ నిర్మాణంతో పాటుగా మరొక కార్పొరేట్ స్కూల్ ఆక్రమణ జరిగిందని, అదే విధంగా సర్వేనెంబర్ 13, 127 లలో కొంతమంది వ్యక్తులు ప్లాట్లు చేసి వాటిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసి విక్రయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవీఎస్ కన్వెన్షన్ హాల్ మూడు ఎకరాలకు పైగా, తత్వ గ్లోబల్ స్కూల్ నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఏర్పాటు చేశారని ఆరోపించారు.

అంతే కాకుండా సర్వేనెంబర్ 13 ప్రభుత్వ భూమిలో ప్లాట్లు చేసి వాటిని సర్వేనెంబర్ 14 ప్రవేటు పట్టాతో రిజిస్ట్రేషన్ చేశారని, ఈ విధంగా ఆక్రమించిన వారిపై, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయా ప్రభుత్వ భూములను సర్వే చేసి ఆక్రమణలు తొలగించి ప్రజా అవసరాల కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో నల్ల జయశంకర్ గౌడ్, అరుణ్ రావు, శ్రీనివాస్ గౌడ్, చందు ఉన్నారు.



Next Story

Most Viewed