ఈటల రాజేందర్​ ఎవరు అంటే మా ఎంపీ అని చెప్పుకునే బ్రాండ్​ ఇమేజ్​‌ని ఇస్తాను : ఈటల

by Aamani |   ( Updated:2024-06-19 14:01:13.0  )
ఈటల రాజేందర్​ ఎవరు అంటే మా ఎంపీ అని చెప్పుకునే బ్రాండ్​ ఇమేజ్​‌ని ఇస్తాను : ఈటల
X

దిశ,కూకట్​పల్లి: ఈటల రాజేందర్​ ఎవరు అంటే మా ఎంపి అని చెప్పుకునే బ్రాండ్​ ఇమేజ్​ను ఇస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్​ అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలోని మైత్రినగర్​ కాలనీ వాసులతో బుధవారం నిర్వహించిన కృతజ్ఞత సభలో ఈటల రాజేందర్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్​ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అన్ని నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి సమయం దొరకలేదు, భారీ మెజారిటీతో గెలిపించిన వారిని కలిసి కడుపునిండా మాట్లాడి పోదామని నియోజకవర్గాల వారీగా అందరిని కలుస్తున్నానని అన్నారు. మాటలు చెప్పటం, హామీలు ఇవ్వడం తనతో కాదని, చేసే పనే మాట్లాడుతుంది అనే సిద్ధాంతాన్ని నమ్మే వాడినని అన్నారు. నాట్​ పాసిబుల్​ అనేది తన డిక్షనరిలో లేదని, ఏ సమస్య అయినా దానికి పరిష్కార మార్గం వెతికే ప్రయత్నం చేస్తానని అన్నారు. మల్కాజిగిరిలో తనను నమ్మి ఓటు వేసి చరిత్రలో నిలిచి పోయే తీర్పు ఇచ్చారని ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.

మా ఎంపీ ఎవరు అంటే ఈటల రాజేందర్​ అని చెప్పుకునే విధంగా పని చేసి బ్రాండ్​ ఇమేజ్​ను ఇచ్చే ప్రయత్నం చేస్తానని అన్నారు. ఐదేండ్ల కాలంలో పలుచబడిన పార్టీలను చూసాం, పదేండ్లలో కనుమరుగైన పార్టీలు చూశాము, 1962 తర్వాత దేశంలో మూడోసారి గెలిచింది కేవలం ఏన్డీయే ప్రభుత్వమేనని అన్నారు. ఈ ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని అన్నారు. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, మూడవ ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాలన్నదే మోడీ తపన అని అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్​ నియోజకవర్గం నుంచి నాలుగు లక్షల మెజారిటీ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు నాలుగు రోజులుగా నియోజకవర్గాల వారీగా తిరుగుతున్నానని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్​పల్లి నుంచి పొత్తులో భాగంగా జనసేన పార్టీ పోటీ చేసింది కూకట్​పల్లిలో మీకు ఓట్లు పడతాయా అని కొందరు అన్నారని, అందరి అంచనాలను తారుమారు చేసే విధంగా కూకట్​పల్లి నియోజకవర్గం నుంచి 25 వేల మెజార్టీ వచ్చిందని అన్నారు.

రానున్న కాలంలో ఈ ఒరవడిని, ఈ గెలుపుని మరింత గొప్పగా నిలుపుకునే విధంగా కార్యకర్తలు, నాయకులు మరింత అకుంఠిత దీక్షతో పని చేస్తారని భావిస్తున్నానని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని అన్నారు. అనంతరం కూకట్​పల్లి మాజీ మున్సిపల్​ చైర్మన్​ సిహెచ్.​ హనుమంత్​ రావును ఈటల రాజేందర్​ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రముఖ వ్యాపార వేత్త జనార్ధన్​ రావు నివాసంలో విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూకట్​పల్లి నియోజకవర్గాన్ని చెందిన పలువురు వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈటల రాజేందర్​ను కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డెపల్లి రాజేశ్వర్​ రావు, మాధవరం కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed