- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC పరీక్ష లీకేజీపై కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తత..
దిశ ప్రతినిధి, మేడ్చల్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. పేపర్ లీకేజీ కి కారకులైన అసమర్థ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్ లు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పట్టుబట్టాయి. అలాగే గ్రూప్-1 పేపర్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైర్మన్, కార్యదర్శి లను సస్పెండ్ చేయాలని.. గ్రూప్ 1 పరీక్ష ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థి సంఘం నేతలు కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా కలెక్టరేట్‌లోకి తోసుకుని రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
ఈ సందర్భంగా ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ.. వందలాది మంది నిరుద్యోగుల ఆత్మబలిదానాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నేడు ఆ నిరుద్యోగుల పాలిట కేసీఆర్ ప్రభుత్వం శాపంగా మారిందని దుయ్యబట్టారు. విద్యార్థులను, నిరుద్యోగు లను ఏమాత్రం పట్టించుకోకుండా ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా అరకొర నోటిఫికేషన్లు వచ్చినప్పటికీ, ఆ నోటిఫికేషన్లను సక్రమంగా నిర్వహించడం లో టీఎస్పీఎస్సీ విఫలమైందన్నారు. ప్రతి నోటిఫికేషన్ హైకోర్టు మెట్టెక్కిందన్నారు. లీకేజీలతో తోటి నిరుద్యోగుల ఆశలను అడియాశలు చేసింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే పీఆర్సీ నివేదిక ప్రకారం.. 2 లక్షల 91 వేల వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
టీఎస్పీఎస్సీ లో పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ.. లీకేజీ అయిన పేపర్‌లని వెంటనే రద్దు చేయాలన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి నైతిక బాధ్యతలు వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఏబీవీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెడుతుందని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనాథ్, విభాగ్ కన్వీనర్ శ్యామ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మనీషా కార్తీక్, శామీర్ పేట నగర కార్యదర్శి రాజు, శిరీష తదితరులు పాల్గొన్నారు.