- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్థలాలు ఉన్న.. పరిశ్రమలు సున్న

దిశ, వర్గల్ : ఆహార శుద్ధి పరిశ్రమల కోసం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక మండళ్లకు పరిశ్రమలు రాక వందల ఎకరాల భూమి నిరుపయోగంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలున్న.. సంస్థల నుంచి ఆశించిన స్పందన లేదు. ఈ మేరకు 2021లో రాష్ట్ర ప్రభుత్వం 'తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ (టీఎస్ఎఫ్ పీజడ్)' లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో 250 ఎకరాలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో భూములను సేకరించాలని ఆదేశించింది. పారిశ్రామిక సంస్థల ద్వారా.. ఆయా జిల్లాల్లోని గ్రామాల్లో పంటలు, కూరగాయలు, పండ్ల తోటలు ఉత్పత్తుల ఆధారంగా ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని నిర్ణయించింది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నది లక్ష్యం.
ఈ మేరకు సిద్దిపేట జిల్లా వర్గల్, ములుగు మండలంలోని 773 ఎకరాల భూమిని సేకరించారు. అయితే ప్రత్యేక జోన్లను గుర్తించి మూడేళ్లు దాటినా కేవలం ఐదు పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. దీంతో ఎకరాల మేరకు భూములు ఖాళీగా ఉన్నాయి. ఈ భూములకు ప్రధాన రహదారుల నుంచి రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఇతర మౌలిక వసతులు లేవు. అధికారులు పరిశ్రమల స్థాపన కోసం ఈ భూములను చూపినా.. సరైన రవాణా, రహదారులు, విద్యుత్, నీటిపారుదల తదితర సౌకర్యాలు లేక సంస్థలు ముందుకు రావడం లేదని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. పెద్ద సంస్థలు రావడం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం స్వయం సహాయక, సహకార, రైతు ఉత్పత్తి సంఘాలకు ఆహారశుద్ధి కోసం ఈ స్థలాలు ఇస్తామని ప్రకటించింది. మౌలిక వసతులు లేవనే కారణంతో అవి ముందుకు రావడం లేదు.