TG Govt.: సీఎంఆర్ఎఫ్‌లో అక్రమాలకు ఇక చెక్..! సీఎంవో కీలక నిర్ణయం

by Shiva |
TG Govt.: సీఎంఆర్ఎఫ్‌లో అక్రమాలకు ఇక చెక్..! సీఎంవో కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి సహాయ నిధిలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎంవో ఆఫీసర్లు నడుం బిగించారు. నిధులు దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో దొంగ బిల్లులు, ఎక్కువ బిల్లులు సమర్పించి పలు ఆస్పత్రులు పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అలాంటి వాటిని అరికట్టేందుకు పలుమార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల వివరాలు అప్‌లోడ్ చేయాలని ప్రజాప్రతినిధులకు సూచనలు చేస్తున్నారు.

పోర్టల్‌లో ప్రత్యేకంగా అలర్ట్ పేజీ డిజైన్

సీఎం రిలీఫ్ ఫండ్ కోసం లబ్ధిదారులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ప్రజాప్రతినిధులందరికీ యాక్సిస్ ఇచ్చారు. సైట్ ఓపెన్ చేయగానే హోంపేజ్ పై ‘ముఖ్య గమనిక’ అనే పేరుతో అలర్ట్ పేజీ డిస్ ప్లే అయ్యేలా పోర్టల్ డిజైన్ చేశారు. అందులో 9 రకాల సూచనలు చేశారు. ‘దొంగ బిల్లులు, ఎక్కువ బిల్లులు సమర్పించే వారిని హెచ్చరించాలి. తప్పుడు సమాచారం, దొంగ బిల్లులు ఇస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మధ్యవర్తులు, దళారులు జోక్యం చేసుకుంటే క్రిమినల్ కేసులు పెడతాం’ అంటూ వార్నింగ్స్ ఇస్తూ సూచనలను పొందుపర్చారు.

దరఖాస్తుకు లబ్ధిదారుడి బ్యాంకు పాస్‌బుక్ అటాచ్

సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తమ వద్దకు వచ్చే దరఖాస్తులకు ప్రజాప్రతినిధులు తమ కవరింగ్ లెటర్ జతచేసి ఆన్‌‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. కానీ దరఖాస్తుదారుడు అర్హుడేనా? వచ్చిన బిల్లులు వాస్తవమేనా? ఆస్పత్రులు ఎక్కువ బిల్లులు ఇచ్చాయా? అనే విషయాలను క్రాస్ చెక్ చేయకపోవడంతో గత సర్కారులో రూ.వందల కోట్లు దారి మళ్లాయి. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం సదరు ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. పలు ఆస్పత్రులను సైతం సీజ్ చేసింది. ఎమ్మెల్యే ఆఫీసుల్లో పని చేసే సిబ్బంది, లోకల్ లీడర్లు, ఆస్పత్రులు కుమ్మక్కై లబ్ధిదారుల పేరుతో ఉన్న మరో వ్యక్తికి చెక్కులు ఇచ్చి డబ్బులు డ్రా చేసుకుని వాటాలు పంచుకున్నారు. అలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే దరఖాస్తుదారడు అప్లయ్ చేసుకున్న సమయంలోనే బ్యాంకు పాస్ పుస్తకం జీరాక్స్ కాపీని సమర్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. చెక్కు తయారి సమయంలో లబ్ధిదారుడి పేరు, అకౌంట్ నంబర్ ముద్రిస్తున్నారు. దీంతో మరో వ్యక్తి చెక్ డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోతుంది.

ఆస్పత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బిల్లుల క్రాస్ చెకింగ్ సమయంలో ఆస్పత్రులు సైతం బాధ్యత వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. గతంలో కేవలం దరఖాస్తుదారుడు సమర్పించిన ఆస్పత్రి బిల్‌పై ఉన్న నంబర్‌కు ఫోన్ చేసి పేషెంట్ వివరాలు, బిల్స్ వివరాలు, సర్జరీ డిటెయిల్స్ కనుక్కునేవారు. కానీ ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి ఆస్పత్రి ప్రతినిధి అనే గ్యారంటీ లేదు. అందుకని తమ వద్దకు వచ్చే ప్రతి దరఖాస్తునూ సీఎం రిలీఫ్ ఫండ్ సెక్షన్ నేరుగా ఆస్పత్రులకు ఆన్‌లైన్‌లో పంపిస్తున్నది. వారు సర్టిఫై చేసిన తర్వాతే దరఖాస్తు స్ర్కూటినింగ్ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఒక వేళ తప్పుడు బిల్లులు, అధిక బిల్లులు ఇస్తే కఠిన చర్యలు తప్పవని సీఎంవో ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు.

బీఆర్ఎస్ కన్నా రెండింతల ఎక్కువ సాయం

సీఎం రిలీఫ్ ఫండ్ కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ప్రతి ఏటా సగటున రూ.350 కోట్లు అందించేది. కాంగ్రెస్ 17 నెలల కాలంలో ఇప్పటికే సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులు రిలీజ్ చేసింది. అంటే ఏడాదికి సుమారు రూ.710 కోట్లు విడుదల చేసినట్టు లెక్క. అలాగే ఎల్‌వోసీలు సైతం గత ప్రభుత్వం కన్నా అధికంగా అందిస్తున్నది. ‘ఎమర్జెన్సీ కేసులు ఉంటే సెలవుల్లో సైతం ఎల్‌వోసీలు ఇస్తున్నాం. ఉదయం దరఖాస్తు చేస్తే సాయంత్రం లెటర్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని రిలీఫ్ ఫండ్ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed