చేతులెత్తేసిన "ట్రైడెంట్".. అయోమయంలో కార్మికులు, రైతులు..

by Sumithra |
చేతులెత్తేసిన ట్రైడెంట్.. అయోమయంలో కార్మికులు, రైతులు..
X

దిశ, జహీరాబాద్: దశాబ్దాల చరిత్ర కలిగిన జహీరాబాద్ చక్కెర కర్మగారంలో క్రషింగ్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. 2024-25 సీజన్లో క్రషింగ్ చేపడతామని ట్రైడెంట్ చక్కెర కర్మగారం యాజమాన్య ప్రతినిధులు లోగడ పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేశారు. అదే మార్గంలో మరమ్మతు పనులు ప్రారంభిస్తున్నామంటూ పేర్కొన్నారు. మరో అడుగు ముందుకేసిన యాజమాన్య ప్రతినిధులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి, నాయకులు, కార్మికులతో కలిసి యాజమాన్య ప్రతినిధులు స్వీట్లు పంచుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా త్వరితగతిన పనులు పూర్తిచేసి డిసెంబర్ మొదటి వారంలో క్రషింగ్ ప్రారంభిస్తామని వారు ప్రకటించారు. రైతులు కూడా స్థానిక కర్మాగారంలో క్రషింగ్ పై ఆశలు పెంచుకున్నారు. పూజలు చేసి రోజులు, వారాలు ఇలా నెలలు గడిచిపోయాయి. ఎట్టకేలకు గడువు సమీపించింది, డిసెంబర్ రానే వచ్చింది.. కానీ క్రసింగ్ పనులు మాత్రం మొదలు కాలేదు. తీరా పరిస్థితిని వాకపు చేస్తే క్రషింగ్ చేయలేమంటూ యాజమాన్యం చేతులెత్తేసిందని కార్మిక వర్గాల ద్వారా తెలిసింది. దీంతో కార్మికులు, రైతులు అయోమయంలో పడిపోయారు.

అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని..

దాదాపు ఆరు దశాబ్దాల పాటు జహీరాబాద్ ప్రాంతంలో సాగుచేసిన చెరుకును క్రషింగ్ చేస్తూ రైతులకు అండగా ఉంటూ వస్తున్న కర్మాగారంలో క్రషింగ్ నిలిచిపోయింది. చెరుకు సాగులో గణనీయమైన అభివృద్ధిని సాధించిన స్థానిక రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. కానీ అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని.. అన్న రీతిగా యాజమాన్యం పరిస్థితి తయారయింది. ట్రైడెంట్ చక్కెర కర్మాగారం పరిధిలో దాదాపు 7 లక్షల టన్నులకు పైగా చెరుకు క్రషింగ్ సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. చెరుకే ప్రధాన పంటగా గడించిన జహీరాబాద్ కీర్తికి మసకబారుతోంది. కరెంట్ బిల్లు కడితే మరమ్మతులు చేపట్టి క్రషింగ్ చేసేందుకు కార్మికులు సంసిద్ధం వ్యక్తం చేసిన యాజమాన్యం ఎంత మాత్రం వారికి సహకరించలేదు. 2 నెలల క్రితమే క్రషింగ్ చేస్తామంటూ కోతలు కూసిన యాజమాన్యం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీరా కోతల సీజన్ ప్రారంభమయ్యే సరికి క్రషింగ్ చేపట్టలేమంటూ తెగేసి చెప్పారు. ఐదు దశాబ్దాలుగా రైతులకు సేవలందించిన స్థానిక కర్మాగారం ప్రైవేటీకరించినా ఫలితం శూన్యం. ఏటికేడు పుట్టుకొచ్చిన కొత్త సమస్యలతో రైతులకు చెరకు తరలింపు పెద్ద సమస్యగా మారింది.

చెరుకు తరలింపులో అవస్థలు..

ట్రైడెంట్ కర్మాగారంలో క్రషింగ్ ప్రక్రియ నిలిచిపోవడంతో క్రషింగ్ కు సిద్ధంగా ఉన్న చెరుకు ఇతర కంపెనీలకు తరలించక తప్పదు. ఈ క్రమంలో రైతులు అనేక అవస్థలకు గురికావాల్సి వస్తుంది. స్థానికంగా పండిన చెరుకును రాష్ట్రంలోని పలు కంపెనీలకు తరలించాలి. ఇక్కడి చెరకు పంటను మూడు కంపెనీలకు తరలించేందుకు వీలుంది. జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లో 10 వేల ఎకరాల్లో సాగుచేస్తున్న సుమారు 4 లక్షల టన్నుల చేరుకును కామారెడ్డి జిల్లా మాగిలోని గాయత్రి షుగర్స్ లిమిటెడ్ , వనపర్తి జిల్లా కొత్తకోట కృష్ణవేణి షుగర్స్, సంగారెడ్డి సమీపంలోని గణేశ్ షుగర్స్ లిమిటెడ్ లకు తరలించే వెసులుబాటును చెరుకు అభివృద్ధి అధికారులు కల్పించారు. అదేవిధంగా కోహీర్, ఝరాసంఘం, న్యాల్కల్, రాయికోడ్, రేగోడ్, వట్పల్లి మండలాల పరిధిలో 7,500 ఎకరాల్లో సాగుచేసిన 4 లక్షల టన్నుల చెరుకును రాయికోడ్ మండలంలోని గోదావరి గంగా ఆగ్రో పరిశ్రమకు తరలించేందుకు వీలుంది. సుదూర ప్రాంతాలకు రైతులే స్వయంగా చెరుకు తరలించేందుకు వీలు లేనందున దళారులపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో విధి లేని పరిస్థితులు తమ ఉత్పత్తులను వచ్చిన కాడికి తెగ నమ్ముకోవడంతో గిట్టుబాటు ధర రాక రైతులు నష్టాల పాలవుతున్నారు. రైతులకు జరుగుతున్న నష్టాలను నివారించేందుకు చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం కనిపించడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

స్థానిక చెరుకు పై పొరుగు రాష్ట్రాల కన్ను..

ఎండలు ముదరకముందే చెరుకును గానుగాడించాలన్న ఉద్దేశంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇష్టం వచ్చిన ధరలకు తెగ నమ్ముకుంటున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో సాగవుతున్న చెరుకు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలోని చక్కెర ఫ్యాక్టరీలకు తరలిస్తారు. కోత కార్మికుల కొరతను ఆసరాగా చేసుకొని పొరుగు రాష్ట్రాల కంపెనీలు కోత, ట్రాన్స్పోర్ట్ కంపెనీలే భరిస్తాయి. నికరంగా రైతుకు టన్ను ధర ప్రకారం చెల్లిస్తారు. టన్నుకు కేవలం రూ.2500లు మాత్రమే చెల్లిస్తున్నారు. కానీ చెరుకు పొలం నుంచి బయటికి పంపెంత వరకు బత్తా, కుషి ఇలా రకరకాల ఖర్చులు కనీసం టన్నుకు రూ.200 మేర భరించాల్సి వస్తుంది. నికరంగా రైతులకు మిగిలేది టన్నుకు రూ. 2300నని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆరుగాలం శ్రమించి, పెట్టుబడులకు సరిపోను లాభాలు రాకపోవడంతో నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. ట్రైడెంట్ యాజమాన్యం పై తాము పెట్టుకున్న నమ్మకం వమ్ము కావడంతోనే తమకు అనుకొని నష్టాలు వచ్చి పడ్డాయని వాపోతున్నారు.

Advertisement

Next Story