BRS ఎంపీపై దాడి.. స్పందించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Naresh |   ( Updated:2023-10-30 17:59:00.0  )
BRS ఎంపీపై దాడి.. స్పందించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సూరంపల్లి ఘటనకు భాజపాకు ఎలాంటి సంబంధం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్ రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీని రాజకీయంగా ఎదుర్కొలేకే అధికార పార్టీ నాయకులు కావాలని కుట్ర చేసి, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగారని ఆరోపించారు. దుబ్బాకలో దాడికి గురైన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్త పెద్ది నవీన్ ను సోమవారం రాత్రి ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఎన్నికల అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు, కేసులు చేయొద్దని నిబంధనలు ఉన్నా పోలీసులు ఉద్దేశపూర్వకంగా బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్త పై దాడి జరుగుతున్నా జిల్లా పోలీసు యంత్రాంగం మాత్రం సకాలంలో స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.



ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అన్ని పార్టీల వారిని సమానంగా చూడాలన్నారు. దాడికి పాల్పడింది బీజేపీ నాయకులు కాదని తెలిసినా దుబ్బాకలో తనపై దుష్ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. సూరంపల్లి ఘటనకు బీజేపీకి సంబంధంలేదని మీడియా సాక్షిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రులు వెల్లడించారన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రాజకీయ పార్టీ దుబ్బాక బంద్ కు ఎలా పిలుపునిచ్చారో ఎన్నికల అధికారులు సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల అధికారులు ఈ విషయంలో చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఒకవేళ బంద్ సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరిగినా రిటర్నింగ్ అధికారి, పోలీస్ కమిషనర్ బాధ్యత వహించాలన్నారు. దాడులను ప్రేరేపించడం హింసకు పాల్పడటం బీజేపీ అభిమతం కాదనీ, ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ బీజేపీ అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని కార్యకర్తలపై దాడి చేసిన వాళ్లకు దుబ్బాకలో గెలుపుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story