ఎన్నో లోసుగులు.. మరెన్నో అక్రమాలు..!

by srinivas |   ( Updated:2024-09-12 02:39:54.0  )
ఎన్నో లోసుగులు.. మరెన్నో అక్రమాలు..!
X

దిశ, మేడ్చల్ బ్యూరో: జిల్లాలో మెడికల్ దందా నడుస్తోంది. ప్రైవేట్ వైద్యరంగంలో ఎన్నో లోసుగులు.. మరెన్నో అక్రమాలు బహిర్గతం అవుతున్నా.. వైద్యారోగ్యశాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మామూళ్ల మత్తులో మునిగిన అధికారులు ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యారోగ్య శాఖలోని ఓ అధికారి ఆశీస్సులతో ఎడాపెడా బోగస్ దవాఖానాలు వెలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నిబంధనలు బేఖాతరు..

జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయోగ్నస్టిక్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వాటికి సరైన అనుమతులు ఉన్నాయా? లేవా? డాక్టర్లకు అర్హత ఉందా? లేదా? అనే విషయాలపై ప్రజలకు పెద్దగా అవగాహన ఉండదు. ఇదే అదునుగా భావించిన యాజమాన్యాలు ప్రజలను ఆకర్షించడానికి పెద్ద పెద్ద లైటింగ్ బోర్డ్స్ పెట్టి మెరుగైన వైద్యం పేరుతో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ దందాను అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ‘ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ 2020 చట్టం’ ప్రకారం ప్రతి ఆస్పత్రి, ప్రతి క్లినిక్‌లో ఆస్పత్రికి సంబంధించిన రిజిస్ట్రేషన్, అందులో పనిచేస్తున్న డాక్టర్ల అర్హత, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తదితర అంశాలను పరిశీలించాలని సూచించింది.

అయితే చాలా వరకు ఆస్పత్రులు, వైద్యులు ఈ నిబంధనలు పాటించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో నకిలీ ఆస్పత్రులు, వైద్యులు రోగులకు చికిత్స అందించడం వంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఉప్పల్‌లో ల్యాబ్ టెక్నీషియన్ భిక్షపతి డాక్టర్ అవతారమెత్తి ఏళ్ల తరబడి వైద్యం అందించడం జిల్లా వైద్యారోగ్య శాఖ పనితీరుకు అద్దం పడుతోంది.

ఇటు సీజింగ్.. అటు ఓపెన్..

జిల్లాలో స్టేట్ మెడికల్ కౌన్సిల్ (ఎస్ఎంసీ) బృందం ఇటీవల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో బోగస్ ఆస్పత్రులు, నకిలీ డాక్టర్ల విషయం బయటపడింది. దీంతో ఆయా ఆస్పత్రులను సీజ్ చేయాలని ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రఘునాథ్ స్వామి ఆధ్వర్యంలో తనిఖీలు చేసి పదుల సంఖ్యలో ఆస్పత్రులు సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన వారం, పది రోజుల్లోనే ఆయా ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు, డయాగ్నస్టిక్ సెంటర్లను తెరుచుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎస్ఎంసీ ఆదేశాల ప్రకారం ఉప్పల్‌లోని శ్రీ మణికంఠ పాలీ క్లినిక్ ను ఏప్రిల్ లో సీజ్ చేశారు. సీజ్ చేసిన నెల వ్యవధిలోనే తిరిగి ఓపెన్ చేశారు. అంతేగాక ఆ ఆసుపత్రికి వైద్యారోగ్య శాఖ అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఒక్క ఆసుపత్రి సీజింగ్.. తిరిగి ఓపెన్‌కు రూ.లక్షల్లో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అయితే ఇదే మణికంఠ ఆస్పత్రిని ఈ నెల 9న ఎస్‌ఓటీ పోలీసులు సీజ్ చేసిన విషయం విదితమే. ఇదే తరహలో ఇటీవల ఉప్పల్‌లో సీజ్ చేసిన వాసవి డయోగ్నస్టిక్ సెంటర్, శోభ సాయి డయాగ్నెస్టిక్, ధన్వంతర్ డయోగ్నస్టిక్ సెంటర్లు తిరిగి ఓపెన్ కావడం విమర్శలకు తావిస్తోంది. వీటితో పాటు జిల్లాలో ఇటీవల్ సీజ్ చేసిన 80శాతం ఆస్పత్రులు తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లాలో సాగుతున్న ప్రైవేట్ వైద్య దందాపై సమగ్ర విచారణ జరిపించి, దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed