హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకోవాలి : ఎస్పీ

by Kalyani |
హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకోవాలి : ఎస్పీ
X

దిశ, సంగారెడ్డి : హోలీ పండుగను సాంప్రదాయ పద్ధతుల్లో, సహజ సిద్ధ రంగులతో జరుపుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. జిల్లా ప్రజలు హోలీ పండగను సంప్రదాయ పద్ధతుల్లో ప్రకృతిలో లభించే, చర్మానికి, పర్యావరణానికి హాని కలిగించని న్యాచురల్ కలర్స్ ను వినియోగించి, ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలను నడపడం, బహిరంగ ప్రదేశాలపై, ఇష్టం లేని వ్యక్తులపై, వాహనాలపై రంగులు, రంగు నీళ్లు చల్లడం వంటివి చేయకూడదన్నారు. బైకులపై, కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే అటువంటి వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. హోలీ పండుగ అనంతరం చెరువుల్లో లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలన్నారు.

ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల కార్యకలాపాలను తరుచూ గమనిస్తూ వారికి సరైన మార్గాలను నిర్దేశించాలన్నారు. యువత వాహనాలు నడిపే క్రమంలో అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, లాంటివి మానుకోవాలని సూచించారు. హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా సున్నిత ప్రదేశాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు వివరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో 100 డయల్ చేయాలని సూచించారు. ఈ హోలీ మీ జీవితాలలో రంగులు నింపాలని కోరుకుంటూ సిబ్బందికి, సంగారెడ్డి జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story