నీలం మధుకు 50 వేల మెజార్టీ ఇవ్వండి

by Disha Web Desk 15 |
నీలం మధుకు 50 వేల మెజార్టీ ఇవ్వండి
X

దిశ, దుబ్బాక : మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా హబ్షీపూర్ ఎక్స్ రోడ్ నుంచి దుబ్బాక మున్సిపాల్ పట్టణంలోని ప్రముఖ కాలనీలు, ప్రధాన రహదారిలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం స్థానిక బస్టాండ్ వద్ద జగ్గారెడ్డి మాట్లాడుతూ..పదేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ పాలకులు చేసింది ఏమీ లేదని విమర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక్క రూపాయి పని చేశాడా అని కార్యకర్తలకు సూచించారు. బీజేపీలో ఓడిపోయిన వారికే ఎంపీ టికెట్లు ఇచ్చారని, ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తులకు ఎంపీగా పనిచేస్తారా? అని ప్రశ్నించారు. ఆయా విషయాలన్నింటిని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ ప్రాంతానికి ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో అమలవుతున్న గ్యారెంటీ పథకాలతో పేద వర్గాలు అందరికీ మేలు జరిగిందన్నారు. మత

రాజకీయాలతో మన ముందుకు వస్తున్న బీజేపీని గెలిపిస్తే ఈసారి దేశాన్ని అమ్ముకుంటారని దుయ్యబట్టారు. ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రధానిని చేయడమే లక్ష్యమని అన్నారు. పేదల సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్ రాబోయే రోజుల్లో మరింతగా మేలు చేసే పథకాలను అమలు చేయనుందని తెలిపారు. పేదింటి బిడ్డ అయిన ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కు దుబ్బాక నియోజకవర్గం నుంచి అత్యధికంగా 50 వేల మెజారిటీతో గెలిపించాలని జగ్గారెడ్డి కోరారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి పనులను తన వంతు బాధ్యతగా తీసుకుంటానని చెప్పారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ పంద్రాగస్టు లోపు చేయడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు.

దుబ్బాక నియోజకవర్గంలో చెరుకు ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి పనులే ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు నియోజకవర్గం నుంచి 50 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ తెచ్చే బాధ్యత తమదేనన్నారు. బీడీ కార్మికుల పొట్టగొట్టే పుర్రె గుర్తు బొమ్మను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే తొలగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అనంతల శ్రీనివాస్, మచ్చ శ్రీనివాస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు నర్మేట ఏసు రెడ్డి, మండల అధ్యక్షుడు కొంగరి రవి, పట్టణ జనరల్ సెక్రెటరీ మంద శ్రీనివాస్, దుబ్బాక అసెంబ్లీ సోషల్ మీడియా కోర్దినేటర్ ఉషయ్య గారి రాజిరెడ్డి, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాతూరు వెంకటస్వామి గౌడ్, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీ రామ్ నరేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed