ఏపీ మంత్రులారా.. చేతనైతే ప్రత్యేక హోదా కోసం పోరాడండి : మంత్రి హరీష్ రావు

by Shiva |
ఏపీ మంత్రులారా.. చేతనైతే ప్రత్యేక హోదా కోసం పోరాడండి : మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: చేతనైతే ప్రత్యేక హోదా కోసం పోరాడండి, విశాఖ ఉక్కు గురించి పోరాడండి, పోలవరం పూర్తి చేసి కాలేశ్వరం లాగా ఇంటింటికీ నీరందించండంటూ మంత్రి హరీష్ రావు ఏపీ మంత్రులకు చురకలంటించారు. సిద్దిపేట అర్బన్ మండల పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మిట్టపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాటం చేయడం లేదంటూ ప్రశ్నించారు. పోలవరం పనులు ఎందుకు ముందుకు సాగడం లేదన్నారు. ఇందులో ఏమైనా తప్పుందా అంటూ ప్రజల పక్షాన మాట్లాడాను తప్పా.. ఆంధ్ర గురించి తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డలేనని పేర్కొన్నారు.

తెలంగాణలో సెటిలైన ఆంధ్ర ప్రజలు చల్లగుండాలంటూ ఆంకాంక్షించారు. తాము ఆంధ్ర గురించి ఏప్పుడూ తప్పుగా మాట్లాడలేదన్నారు. ఈ విషయంలో ఆంధ్ర ప్రజలను కానీ, రాష్ట్రాన్ని కించపరచే విధంగా మాట్లాడాను అని అక్కడి నాయకులు అనడం.. వారి విజ్ఞతకు వదిలేస్తున్నానని తెలిపారు. అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. చేతనైతే జాతీయ హోదా కోసం పోరాడాలని హితవు పలికారు. విశాఖ ఉక్కు కోసం పోరాడాలని సూచించారు. పోలవరం తొందరగా పూర్తి చేసి కాళేశ్వరం లాగా నీళ్లందించాలంటూ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed