అంబేద్కర్ స్పూర్తిగా సీఎం కేసీఆర్ పాలన: మంత్రి హరీష్ రావు

by Shiva |   ( Updated:2023-04-14 10:35:51.0  )
అంబేద్కర్ స్పూర్తిగా సీఎం కేసీఆర్ పాలన: మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: విద్యా, అర్ధిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా, అంబేద్కర్ స్ఫూర్తిగా సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వ పాలన కొనసాగుతోందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. డా. బీఆర్. అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. మోడ్రన్ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మంత్రి హరీష్ రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, దళిత, బహుజన సంఘాల ప్రతినిధులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం షెడ్యూల్డ్స్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రంలోని వెయి గురుకుల పాఠశాలను నెలకొల్పి ఇంటర్ వరకు విద్యా నందిస్తున్నట్లు తెలిపారు. దీనికి తోడు దళితుల ఆర్ధిక అభ్యున్నతే ధ్యేయంగా దేశంలో ఎక్కడ లేనివిధంగా రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. విదేశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం అంబేద్కర్ ఓవర్ సీస్ పథకంలో గత ప్రభుత్వాలు అప్పులిస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రాంట్ రూపంలో అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర సచివాలయానికి ఓ వైపు అంబేద్కర్, మరో వైపు అమరవీరుల స్తూపం ఉందన్నారు. అంబేద్కర్, అమర వీరుల స్పూర్తితో పాలన సాగించాలనే ఉద్దేశ్యంతో దేశంలో అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయం వద్ద ప్రభుత్వం నిర్మించిందన్నారు. అంబేద్కర్ విగ్రహం ప్రతిమ కాదని, ప్రజల చైతన్య కలల దీపికగా అభివర్ణించారు. దేశం మొత్తంగా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. అంబేద్కర్ విగ్రహ అవిష్కరణ సభకు అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.

అంబేద్కర్ స్ఫూర్తితో దళిత గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీచైర్ పర్సన్ వేలేటి. రోజాశర్మ, మున్సిపాల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల ప్రతినిధులు సాకి బాల్ లక్ష్మీ అనంద్, గ్యాదరి రామస్వామి, నాయిని చంద్రం, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పథకాల లబ్దిదారులకు మంత్రి హరీష్ రావు ప్రొసిడింగ్ కాఫీలను అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed