NEW PCC: ఆ అంశాలే నాముందున్న పెద్ద సవాల్.. సీఎంతో భేటీ అనంతరం మహేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |
NEW PCC: ఆ అంశాలే నాముందున్న పెద్ద సవాల్.. సీఎంతో భేటీ అనంతరం మహేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వంతో పార్టీని సమన్వయం చేయడంతో పాటు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలే నా ముందున్న అతిపెద్ద సవాల్ అని నూతన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తన నియామకానికి సహకరించిన అధిష్టానానికి, రాష్ట్ర పార్టీ నేతలందరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని ఇందుకు తన నియామకమే నిదర్శనమన్నారు. పీసీసీ పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారని వారందరూ ఆ పదవికి అర్హులే అయినప్పటికీ వివిధ సమీకరణాల నేపథ్యంలో అధిష్టానం తనకు అవకాశం కల్పించిందని భావిస్తున్నానన్నారు. ఈ ఉదయం తన కుటుంబసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మహేశ్‌కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన నియామకానికి సహకరించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన గణపతి పూజలో మహేశ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడిన మహేశ్‌కుమార్ గౌడ్.. పీసీసీ పదవి విషయంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవి కోసం పోటీ పడిన వారితో కలిసి పని చేస్తానన్నారు. ఈ పదేళ్ల పాటు పార్టీనే నమ్ముకుని కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కేలా కృషి చేస్తానన్నారు. రెండు మూడు రోజుల్లో టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తానన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా ఉంటూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. త్వరలోనే కమిటీలను నియమిస్తామని, పార్టీ పదవులు భర్తీ చేస్తామని చెప్పారు. కాగా, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి సైతం సీఎంను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం వీరిద్దరు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు.

ఖైరతాబాద్ గణపతిని సీఎం రేవంత్ తొలి పూజ

ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకుని తొలి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి దీపా దాస్‌మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా గణపయ్యకు గణనాథుడికి భారీ గజమాల సమర్పించారు. పూజ అనంతరం మాట్లాడిన సీఎం.. దేశంలోనే ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇంత పెద్ద ఉత్సవాలను నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీకి ప్రత్యేకంగా అధినందిస్తున్నానన్నారు. తెలంగాణలో గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. అకాల వర్షాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిందని అందరి పూజలతో గణపతి ఆశీస్సులతో వరదల నుంచి బయటపడగలిగామన్నారు. గతేడాది పార్టీ అధ్యక్షుడిగా వచ్చానని, ఈసారి సీఎం హోదాలో వచ్చానన్నారు. ప్రతీ ఏటా ఉత్సవ కమిటీ ఎప్పుడు ఆహ్వానించినా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నానని గుర్తు చేశారు. కాగా, ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు ‘సప్తముఖ మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమై 70 ఏళ్ళు అవుతున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో రూపొందించారు.

తెలంగాణ ప్రభ వెలగాలి: ముఖ్యమంత్రి

NEW PCCవినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆది దేవుడు విఘ్నేశ్వరుడి కృప అందరిపై ఉండాలని ప్రార్థిస్తూన్నానన్నారు. వాడ వాడల వెలిసే గణేశ్ మండపాలలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలన్నారు. ‘ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రభ వెలగాలి. అభివృద్ధి పథాన.. అడ్డంకులన్నీ తొలగాలి’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

Advertisement

Next Story