ఎమ్మెల్యే ప్రయత్నం ఫలించేనా ?

by Sumithra |
ఎమ్మెల్యే ప్రయత్నం ఫలించేనా ?
X

దిశ, నవాబుపేట /జడ్చర్ల : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గం ప్రజలకు, నవాబుపేట మండలంలోని కొల్లూరు గ్రామ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయోనని జడ్చర్ల నియోజకవర్గ, కొల్లూరు గ్రామ ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో జడ్చర్లను రెవెన్యూ డివిజన్ గా, కొల్లూరు గ్రామాన్ని ఖచ్చితంగా మండలంగా ఏర్పాటు చేసి తీరుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గతంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో నియోజకవర్గ, కొల్లూరు గ్రామ ప్రజలు అనిరుద్ రెడ్డి హామీని విశ్వసించి ఆయనను ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించారు. గతంలో పలు సందర్భాలలో లక్ష్మారెడ్డి కొల్లూరు మండల ఏర్పాటుకు అవసరమైన జనాభా, ఎంపీటీసీ స్థానాలు లేకపోవడం వల్లే కొల్లూరు మండల ఏర్పాటు సాధ్యం కావడం లేదని బహిరంగంగా వెల్లడించారు. అందుకు సంబంధించి ఏవైనా వెసులుబాట్లు ఉంటే తెలిపి మండల ఏర్పాటుకు తనకు సహకరించాలని ప్రతిపక్ష పార్టీల నాయకులను కోరారు. ఆ రాద్దాంతం ప్రతిపక్ష, అధికార పక్ష నాయకులు మధ్య కొనసాగుతుండగానే సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి.

2023 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు జడ్చర్లను రెవెన్యూ డివిజన్ గా, కొల్లూరును మండలంగా ఏర్పాటు చేస్తామని చేర్చడంతో పాటు ఎన్నికల్లో తమను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తప్పనిసరిగా రెవెన్యూ డివిజన్ ను, మండలాన్ని ఏర్పాటు చేసి తీరుతామని హామీలు గుప్పించారు. నియోజకవర్గంలోని మెజారిటీ ఓటర్ల అభిమతం మేరకు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనిరుద్ రెడ్డి శాసనసభలో పదేపదే ఈ విషయం గురించి ప్రస్తావిస్తున్నారు. కొల్లూరును మండలంగా, జడ్చర్లను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఆయన మరోసారి మంగళవారం జరిగిన శాసనసభ సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రకటించిన మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి సమాధానం ఇస్తూ డివిజన్ మండలాల ఏర్పాటు గురించి పరిశీలిస్తామని అధికారుల నివేదికల ఆధారంగా ఎలాంటి భేషజాలకు పోకుండా వీలుంటే తప్పకుండా వాటిని చేస్తామని హామీ ఇచ్చారు.

దానివల్ల మండల ఏర్పాటు విషయంలో ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లుగా కనిపిస్తున్నది. అయితే మంత్రి కొల్లూరును మండలంగా ఏర్పాటు చేస్తామని, జడ్చర్లను డివిజన్ గా ఏర్పాటు చేస్తామని వెంటనే స్పష్టమైన హామీని ఇవ్వకుండా అధికారుల నివేదికలను ఆధారంగా చేసుకుని పరిశీలిస్తామని, పాసిబిలిటీ ఉంటే ఎలాంటి భేషజాలకు పోకుండా వాటిని ఏర్పాటు చేస్తామని మాత్రమే తెలపడం వల్ల వాటి ఏర్పాటు విషయంలో మండల నియోజకవర్గ ప్రజల్లో మీమాంస నెలకొన్నది. ప్రభుత్వం అందుకు సంబంధించిన పరిశీలనలు జరిపించి అధికారుల నివేదికలను త్వరితగతిన తెప్పించుకొని వాటి ఏర్పాటుకు సంబంధించి స్పష్టమైన హామీని ఇస్తేనే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. అందుకోసం ఆయన సైతం అధికారుల పై ఒత్తిడి తెచ్చి వాటి సైనిర్వహణకు వారిని సన్నద్ధులను చేసి వాటి ఏర్పాటులో గల సౌకర్యాలను, సౌలభ్యాలను పరిశీలింపజేసి, సాధ్యం చేయడానికి అవసరమైన నివేదికలను తయారు చేయించి తన హామీని నిలబెట్టుకోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed