MP Aruna : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మతపరమైన అంశం కాదు

by Kalyani |
MP Aruna : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మతపరమైన అంశం కాదు
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు కొందరు మతం రంగు పులిమి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ బోర్డు ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరడం లేదని, వక్ఫ్ బోర్డు ద్వారా ఏ ఒక్క ముస్లిం లాభపడ్డారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకే వక్ఫ్ బోర్డు లో సవరణలు చేయడానికే పూనుకుందని, దురదృష్టవశాత్తు కొందరు పనికట్టుకుని సవరణలపై తప్పుడు ప్రచారాల వీడియోలు సృష్టించారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక విడియోను ప్రదర్శించారు.

తెలంగాణా వక్ఫ్ బోర్డు పరిధిలో సుమారు 80 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, బాధితులంతా వచ్చి బోర్డు వలన తమకు న్యాయం జరగలేదని వినతి పత్రాలను ఇస్తున్నారని ఆమె అన్నారు. ఈ విషయంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ నెలాఖరున కమిటీ పర్యటన ఉంటుందని, త్వరలో తేదీలను ప్రకటిస్తామని, ఆ రోజు బాధితులు తమ తమ అభిప్రాయాలను, వాదనలను నిర్మొహమాటంగా వినిపించుకోవచ్చని, తెలిపిన అభిప్రాయాలు నమోదు చేసుకుని బోర్డు లక్ష్యం నెరవేర్చేందుకే కమిటీ ప్రయత్నిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

సభ్యత్వంతోనే పార్టీ పటిష్ట పడుతుంది....

వచ్చే నెల 1 నుంచి పార్టీ రెండవ దశ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, సభ్యత్వంతోనే పార్టీ పటిష్ట పడుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు.మోదీ వికసిత్ సంకల్పం లక్ష్య ఛేదనలో ప్రజల మద్దతు ఉండేలా సభ్యత్వాలు పెంచాలని, దేశం హితమే బీజేపీ అభిమతమని ఆమె అన్నారు. అభివృద్ధి పేరుతో తెలంగాణను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని,ఇప్పుడు కాంగ్రెస్ ను గెలిపిస్తే రాష్ట్రాన్ని అప్పుడే అప్పుల కుప్పగా మార్చారని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో రెండు నెలలోనే 12 మంది అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగాయని, 21 మంది కూలీలు, 26 మంది వివాహిత మహిళలు, ఆగస్టు 4 న ఇద్దరు జర్నలిస్టులపై దాడులు జరిగినా,రాహుల్ గాంధీ కానీ, రాష్ట్ర పెద్దలు కానీ ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed