మిల్లర్ల ఇష్టారాజ్యం.. పక్కదారి పడుతున్న సీఎంఆర్ ధాన్యం..

by Sumithra |
మిల్లర్ల ఇష్టారాజ్యం.. పక్కదారి పడుతున్న సీఎంఆర్ ధాన్యం..
X

దిశ, ప్రతినిధి వనపర్తి : కస్టమ్స్ మిల్లింగ్ రైస్ అంశంలో మిల్లర్లది ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తోంది. రైస్ మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మర ఆడించి బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అందజేయాల్సిన మిల్లుల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడడంతో సీఎంఆర్ రైస్ పక్కదారి పడుతోంది. మూడు సీజన్లు గడుస్తున్నా ఇప్పటికీ కొన్ని మిల్లుల యజమానులు సీఎంఆర్ బియ్యం ఎఫ్సీఐ అధికారులకు అందజేయలేదంటే వారి తీరు ఏ విధంగా ఉందో అర్థం అవుతోంది.

నిబంధనలకు పాతర..

ప్రభుత్వ నిబంధనలను ఆ మిల్లర్ల యజమానులు ఏ మాత్రం పట్టించుకోకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రతి ఏడాది రెండు సీజన్లలో రైతులు పండించే వరి ధాన్యాన్ని ప్రభుత్వం అష్ట కష్టాలు పడి మద్దతు ధరకు కొనుగోలు చేసి మర ఆడించడానికి మిల్లర్లకు కేటాయిస్తూ వస్తోంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మర ఆడించి 67% బియ్యాన్ని మాత్రమే తిరిగి ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. అయితే లాభార్జనే ధ్యేయంగా పెట్టుకున్న మిల్లర్లు ధాన్యాన్ని వ్యాపారం వనరులుగా మార్చుకుంటూ లావాదేవులు సాగిస్తున్నారు. దీంతో మూడు సీజన్లు గడిచినా ప్రభుత్వానికి బియ్యం అందచేయకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు.

అంతేకాకుండా చాలామంది మిల్లుల యజమానులు సీఎంఆర్ ధాన్యాన్ని గడువు లోపల ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు విక్రయించుకొని భారీగా లాభాలు అర్జిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే మూడు సీజన్లు గడిచినా సీఎం అర్ బియ్యాన్ని ఎఫ్ సీ ఐ కి అందజేయలేదు. దీనిపై పలుమార్లు ప్రభుత్వం గడువు పెంచుకుంటూ వచ్చినా మిల్లర్లు ఖాతరు చేయడం లేదు. తాజాగా గత యాసంగి పంటకు సంబంధించిన ధాన్యం మార్చి చివరి వరకు ఇవ్వాలని కోరినా మిల్లర్లు ఏ మాత్రం పట్టించుకోకుండా ఉన్నారు. ఇప్పటి కీ ఇంకా 38 వేల టన్నుల బియ్యం ఎఫ్ సీఐ కి ఇవ్వాల్సి ఉంది. దీంతో తాజాగా ప్రభుత్వం ఈ మాసం చివరి వరకు అయినా బియ్యాన్ని ఇవ్వమని గడువు పెంచడం జరిగింది.

కాసులు కురిపిస్తున్న వ్యాపారం...

రూపాయి పెట్టుబడి లేకుండా ప్రభుత్వమే ధాన్యం ఇవ్వడం మర ఆడించిన తర్వాత 67 శాతం బియ్యం మాత్రమే తిరిగి ఇవ్వాలని నిబంధనలు ఉండడంతో మిల్లు యజమానులకు బియ్యం వ్యాపారం కాసులు కురిపిస్తుంది. గతంలో వనపర్తి జిల్లాలో 80 వరకు మాత్రమే మిల్లులు ఉండేవి. ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు మర ఆడించి ఇవ్వడానికి ఉచితంగా ఇస్తుండడంతో ఎలాంటి పెట్టుబడి లేని వ్యాపారంగా మారింది. దీంతో కొత్త మిల్లులు పుట్టగొడుగులుగా పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం వనపర్తి జిల్లాలో 135 రా మిల్లులు, 10 వరకు పారాబాయిల్డ్ రైస్ మిల్లులు ఏర్పడ్డాయి. పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వ ధాన్యం ఇస్తుండడంతో మిల్లుల యజమానులు సిఎంఆర్ ధాన్యాన్ని తమ వ్యాపార పెట్టుబడులుగా మార్చుకుంటున్నారు. ఈ సీజన్లో ఇచ్చిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ సదరు ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

చూస్తుండగానే మరో సీజన్ రావడం ప్రభుత్వం మళ్లీ ధాన్యం ఇవ్వడం అట్టిధాన్యాన్ని మర ఆడించి కొంత మేరకు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడం, మరి కొంత పెండింగ్లో పెట్టడం ఇలా వరుసగా చేస్తూ లాభాలు గడిస్తున్నారు. 2021- 22 యాసంగి సీజన్లో ప్రభుత్వం లక్షా 36 వేల 835 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించగా వారు ప్రభుత్వానికి 93వేల 48 టన్నుల బియ్యాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉండగా గడువు పూర్తయినా నేటికీ ఇంకా 38 వేల టన్నుల బియ్యం ఆయా మిల్లుల యజమానులు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. అంతేకాకుండా అంతకు ముందు ఏడాది యాసంగి గత ఏడాది వానాకాలం సీజన్ కు సంబంధించిన బియ్యం సైతం ఇంకా ఎఫ్ సి ఐ కి రావాల్సి ఉందని సమాచారం.

జోరుగా అక్రమ దందా...

సీజన్ వారిగా ప్రభుత్వం తమకు కేటాయించిన ధాన్యాన్ని బియ్యం గా మార్చి ఎఫ్సీఐకి అప్పచెప్పాల్సిన మిల్లర్లు కావాలనే కాలయాపన చేస్తూ ధాన్యాన్ని అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాలకు విక్రయించుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పలుమార్లు పోలీస్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీలను పట్టుకోవడమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అక్రమ దందాకు పాల్పడుతున్న మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారులు కేసులు నమోదు చేసిన మళ్లీ అవే మిల్లులకు ధాన్యానికి కేటాయించడం విమర్శలకు తావిస్తోంది.

గత ఏడాది అక్రమంగా తరలిస్తున్న 700 బస్తాల బియ్యాన్ని పెబ్బేర్లో పట్టుకున్నారు. అలాగే శ్రీరంగాపూర్ నుంచి లారీలో తరలిస్తున్న బియ్యం, కొత్తకోటలో మరో లారి బియ్యాన్ని సైతం అధికారులు గతంలో సీజ్ చేశారు. రెండు రోజుల క్రితం వనపర్తి జిల్లా కేంద్రంలో లారీలో తరలిపోతున్న బియ్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని చూస్తుంటే మిల్లుల యజమానులు ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని ఎంత దర్జాగా విక్రయిస్తూ అక్రమ దందాకు పాల్పడుతున్నారో తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed