అక్రమ వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మాడ్గుల!

by D.Reddy |
అక్రమ వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మాడ్గుల!
X

దిశ, మాడ్గుల : అక్రమ వ్యాపారాలకు మాడ్గుల మండలం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. వీటిని నిలువరించాల్సిన అధికారులే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాడ్గుల మండలంలోని ఫకీర తండా గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న కారంపొడి ఫ్యాక్టరీకి అక్రమంగా మాడ్గుల చెరువు ఎర్రమట్టి, కృత్రిమ ఇసుక తరలిస్తున్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఎర్రమట్టి గుట్టలు గుట్టలుగా పోశారు. కృత్రిమ ఇసుక తయారు చేసేవారు ఎవరికీ అనుమానం రాకుండా అవసరం మేరకే చెరువులో ఇసుకను తయారుచేసి కంపెనీ వారికి సరఫరా చేయడం వారి మార్క్ దందాకు నిదర్శనం. మండలంలోని ఇతర గ్రామాల్లో అక్రమంగా ఇసుక, మట్టిని తరలిస్తే పోలీసులు వాటిని పట్టుకుని వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్న సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుండగా మాడుగుల గ్రామంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. తాసీల్దార్ కార్యాలయం పక్క నుంచి పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఎర్ర మట్టిని తరలించే వారిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎర్రమట్టి, కృత్రిమ ఇసుక తరలిస్తు్న్న వారు, వారికి సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed