మునుగోడు టీఆర్ఎస్‌లో కొత్త లొల్లి.. హుజూరాబాద్ సీన్ రిపీట్!

by GSrikanth |   ( Updated:2022-10-10 00:00:42.0  )
మునుగోడు టీఆర్ఎస్‌లో కొత్త లొల్లి.. హుజూరాబాద్ సీన్ రిపీట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడులో లోకల్ వర్సెన్ నాన్ లోకల్ వార్ స్టార్ట్ అయింది. ఉప ఎన్నికల్లో ప్రచారానికి ఇతర నియోజకవర్గానికి చెందిన నేతలు రావడం వారే అన్నీ తానై వ్యవహరిస్తుండటంతో స్థానికంగా ఉన్న నేతలకు మింగుడుపడటం లేదు. గుర్తింపు సైతం తగ్గడంతో ఏం చేయాలో తోచని స్థితిలో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానిక నేతలను కలుపుకొని పోవాలని అధిష్టానం సూచించినప్పటికీ ఇద్దరి మధ్య సమయోధ్య కుదరకపోవడం లేదు. ప్రతీ 100 మంది ఓటర్లకు ఒక కోఆర్డినేటర్‌ను సైతం ఎమ్మెల్యే తమ అనుచరులను నియమించారు. దీంతో లోకల్, నాన్ లోకల్ నేతల మధ్య గ్యాప్ ఉండటంతో హుజూరాబాద్ బైపోల్ సీన్ మునుగోడులోనూ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మునుగోడు బైపోల్ టీఆర్ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు కోసం ప్రణాళికలు రూపొంచింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలకే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లను, ఎంపీలను అందరిని భాగస్వామ్యం చేస్తుంది. నియోజకవర్గంలోని 86 ఎంపీటీసీ స్థానాలను యూనిట్లుగా విభజించి ఒక్కో యూనిట్‌కు ఎమ్మెల్యేను ఇన్‌చార్జీగా నియమించింది. మున్సిపాలిటీలోని రెండువార్డులకు ఒక ఎమ్మెల్యేను ఇన్‌చార్జీగా నియమించింది. ఎలా ప్రచారం చేయాలో ఇప్పటికే అధినేత దిశానిర్దేశం చేశారు. ప్రణాళికను ఇచ్చారు. దీంతో ఇన్ చార్జులంతా నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒక్క ఓటు కూడా ఇతర పార్టీలకు పడకుండా గంపగుత్తుగా టీఆర్ఎస్‌కు పడేలా చర్యలు చేపట్టింది. ఒక్కొక్క ఇన్‌చార్జీ ప్రతి 100 మంది ఓటర్లకు ఒక కోఆర్డినేటర్‌ను నియమించింది. ఆ కోఆర్డినేటర్‌పై మరో అబ్జర్వర్‌‌ను నియమించారు. పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదిక అందజేసేలా చర్యలు చేపట్టారు.

స్థానిక పార్టీ నేతలకు అవమానం

ఎంపీటీసీ యూనిట్ ఇన్‌చార్జీగా పనిచేస్తున్న ఎమ్మెల్యేను గులాబీ అధిష్టానం నియమించింది. ఆ ఎంపీటీసీ పరిధిలో సుమారు 2500 నుంచి 3 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లను కోఆర్డినేషన్ చేయడానికి ఎమ్మెల్యేలు తమ ప్రధాన అనుచరులను 100 మందికి ఒకరిని కోఆర్డినేటర్‌గా నియమించారు. ఈ నియామకంలో స్థానిక నేతలకు ప్రాధాన్యం లేదు. ఒక్కో ఎమ్మెల్యే 20 నుంచి 50 మంది వరకు తమ నియోజకవర్గం వారినే నియమించుకున్నారు. వీరే ప్రచారంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. దీంతో స్థానిక నేతలు కేవలంలో ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ ప్రాధాన్యం దక్కడం లేదని ఓ గ్రామ సీనియర్ నేత అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో తమకు ప్రాధాన్యం తగ్గకపోవడంతో ప్రజలకు అలుసు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సహకారం అంతంతే

ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలదే హవా నడుస్తోంది. స్థానిక నేతలు కేవలం ప్రచార బొమ్మలుగానే మారుతుండటంతో మనోవేదనకు గురవుతున్నారు. దీంతో లోకల్, నాన్ లోకల్ తేడా వచ్చి పరస్పర సహకారం కొరవడుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య సహకారంలో లేకపోతే గెలుపోటములపై ప్రభావం పడే అవకాశం ఉంది.

హుజూరాబాద్ సీన్ రిపీట్!

హుజూరాబాద్ బైపోల్ సమయంలోనూ టీఆర్ఎస్ ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సైతం ప్రచారం చేశారు. స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అన్ని తానై ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే వ్యవహరించారు. దీంతో పార్టీ కేడర్‌తో పాటు ప్రజల్లోనూ వ్యతిరేకత వచ్చింది. బైపోల్ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తపథకాలు ప్రవేశపెట్టినా, అభివృద్ధి పనులు చేపట్టినా విజయం సాధించలేదు. ఇప్పుడు మునుగోడు బైపోల్‌లోనూ స్థానిక నేతలకు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారికి బాధ్యతలు అప్పగించడంతో గ్రామస్థాయి నుంచి స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇలాగే పోలింగ్ వరకు కొనసాగితే హుజూరాబాద్ ఫలితాలే మునుగోడులోనూ రిపీట్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed