మెట్రో ఛార్జీల పెంపుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-11 09:05:17.0  )
మెట్రో ఛార్జీల పెంపుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మెట్రో ఛార్జీలు పెరగబోతున్నాయన్న వార్తల నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా మంత్రి చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన కేటీఆర్ మెట్రో ఛార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన మెట్రో యాక్ట్ ప్రకారం ఛార్జీల నిర్ణయాదికారం పూర్తిగా మెట్రో నిర్వహణ సంస్థకే కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టిందని చెప్పారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో బాధ్యతలను చూస్తున్న ఎల్‌అండ్‌టీ ఛార్జీల పెంపు దిశగా యోచిస్తోందని, అడ్డగోలుగా ధరల పంపు ఉండకూడదని తాము ఎల్‌అండ్‌టీ‌కి తగిన సూచనలు చేశామన్నారు.

ఆర్టీసీ బస్సులతో సమానంగా మెట్రో ఛార్జీలు ఉండాలని చూసుకోవాలని చెప్పామన్నారు. మెట్రోలో ఏడీఎస్ ఉండాలన్న నిర్ణయం కాంగ్రెస్ హయాంలోనిదేనని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేంద్ర వైఖరిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మెట్రో నూతన మార్గాల ఏర్పాటుకు కేంద్రం మోకాలడ్డుతోందని ఆరోపించారు. దేశంలోని చిన్న చిన్న నగరాలకు మెట్రో ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తున్న కేంద్రం.. హైదరాబాద్ విషయంలో శత్రువులను చూసినట్టుగా చూస్తోందన్నారు.

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లోని పలు మార్గాల్లో మెట్రోను విస్తరించేందుకు సహకరించడం లేదన్నారు. నాలాల అభివృద్ధి కార్యక్రమం ఎస్ఎన్‌డీపీలో భాగంగా నగరంలో నలుమూలల మురుగు నీటి వ్యవస్థను పటిష్టం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 9 నెలల్లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, తొమ్మిది నెలల్లో పిల్లలు పుడతారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story