బ్రేకింగ్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్..?

by Satheesh |   ( Updated:2023-10-25 06:50:09.0  )
బ్రేకింగ్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్..?
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ మార్పులు, రాజీనామాలు, అసమ్మతి నేతల తిరుగుబాటు వంటి పరిణామాలతో రాజకీయం పీక్స్‌కు చేరుకుంటుంది. ఏ నేత ఎప్పుడు.. ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం స్టేట్ పాలిటిక్స్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పొసగక హస్తానికి హ్యాండ్ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. కొంతకాలంగా బీజేపీలో తీవ్ర అసంతృప్తితో ఆయన కమలానికి గుడ్ బై చెబుతున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ 52 మంది అభ్యర్థులతో ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌లోనూ రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడం కూడా పార్టీ మార్పు వార్తలకు మరింత బలంం చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలోనే తిరిగి మళ్లీ ఆయన హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం.

చేరికకు ముహూర్తం ఫిక్స్..!

బీజేపీని వీడనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎల్లుండి (శుక్రవారం) ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరికపై ఆయన ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపినట్లు టాక్. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రాజగోపాల్ రెడ్డితో చేరికపై మంతనాలు జరిపి.. తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. జాయినింగ్‌కు ఢిల్లీ హైకమాండ్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎల్లుండి లాంఛనంగా తిరిగి సొంతగూటికి చేరనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకోన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులతో భేటీ కానున్నారు. ఫామ్ హౌస్‌లో సమావేశం నిర్వహించి కార్యకర్తలతో చర్చించిన అనంతరం ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇవాళ కార్యకర్తలతో జరిగే మీటింగ్ అనంతరం కోమటిరెడ్డి భవిష్యత్ కార్యచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story