Kiran Kumar Chamala: ఫేక్ పోస్టులు పెడితే జైలు పాలే.. కాంగ్రెస్ ఎంపీ హెచ్చరిక

by Ramesh Goud |
Kiran Kumar Chamala: ఫేక్ పోస్టులు పెడితే జైలు పాలే.. కాంగ్రెస్ ఎంపీ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడమే బీఆర్ఎస్ పనా?, చిల్లర పైసలకు ఆశపడి సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడితే జైలు పాలవుతారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీపై సంచలన విమర్శలు చేశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, ఏ పార్టీ కూడా తప్పుడు ప్రచారాలను చేయోద్దని, అలా చేసే వారిని ప్రోత్సహించకూడదని అన్నారు. తెలంగాణ భవిష్యత్తు కోసం, ప్రజల అభ్యున్నతి కోసం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని, అధికార పార్టీకి ఏవైనా సలహాలు, ప్రతిపక్షాలు సూచనలు ఇవ్వదలిస్తే కచ్చితంగా ఇవ్వచ్చని సూచించారు. కానీ, సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని తెలిపారు.

చిల్లర పైసలకు ఆశపడి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి జైలుకు వెళితే వారిని కాపాడేవారు కూడా ఎవరూ ఉండరని హెచ్చరించారు. ఇది గమనించి, డబ్బుల కోసం ఆశపడి, జీవితాలను పణంగా పెట్టవద్దని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదేళ్లు గడవలేదని, కేవలం ఐదు నెలలు మాత్రమే అయ్యిందని అన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా ప్రశ్నించే వారిని అణగదొక్కే ప్రయత్నాలు చేయట్లేదని, ప్రజాపాలనపై దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లు అధికారంలో ఉండి, అన్ని శాఖల్లోనూ చీకటి జీవోలిచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని ఆరోపించారు.

ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే తెలంగాణ ప్రజలకు తెలియజెప్పిందని, అయితే ఆ నిజాలను కూడా వక్రీకరించి, ఆరు గ్యారెంటీలు ఇవ్వకుండా సాకులు చెబుతున్నారని చెబుతూ.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలన్న దురుద్దేశ్యంతో బీఆర్ఎస్ పార్టీ అబద్దాలను ప్రచారం చేశిందని అన్నారు. ఆరు గ్యారెంటీల్లో రెండు అమలు చేసిన తర్వాత ప్రజాపాలన పేరుతో అప్లికేషన్లు తీసుకొని వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించామని, దీనిని కూడా కాలయాపన కింద తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. అన్ని పథకాలపై అసత్య ఆరోపణలు చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్.. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా కేవలం ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకుందని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed