సమస్యల వలయం వైరా మున్సిపాలిటీ

by Mahesh |
సమస్యల వలయం వైరా మున్సిపాలిటీ
X

దిశ, వైరా: నాలుగేళ్ల క్రితం నూతనంగా ఏర్పడిన వైరా మున్సిపాలిటీ నేటికీ పురిటి నొప్పులతోనే బాధపడుతున్నది. ఈ మున్సిపాలిటీని అనేక సమస్యలు వేధిస్తున్నాయి. గ్రామ పంచాయతీలో ఉన్న సౌకర్యాలు సైతం ఇక్కడ కొన్ని లేవంటే అతిశయోక్తి కాదేమో. మున్సిపాలిటీకి ఆదాయాన్ని చేకూర్చే అంశాలను సైతం అధికారులు నీరుగారుస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో ప్రధానంగా వైకుంఠధామాల నిర్మాణాలు చేయకపోవడం, ప్రభుత్వం నుంచి వారసత్వంగా వస్తున్న ఇళ్లకు డాక్యుమెంట్లు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేయకపోవడం, పశువుల సంతకు గ్రహణం పట్టడం, అధికారుల నిర్లక్ష్యంతో ఎస్సీ సబ్ ప్లాన్, విలీన గ్రామాల గ్రాంట్ మురిగిపోవడం, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో లక్షలాది రూపాయలు మున్సిపాలిటీ ఖాతాలోనే మూలగటం, విలీన గ్రామాలకు నిబంధన ప్రకారం 33 శాతం నిధులు కేటాయించకపోవడం, ట్రేడ్ లైసెన్సుల ఆదాయాన్ని వనరులుగా పూర్తిస్థాయిలో మార్చుకోక పోవడం తదితర సమస్యలు మున్సిపాలిటీని వేధిస్తున్నాయి. బడ్జెట్ సమావేశానికి వచ్చే కలెక్టర్ సారూ... ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారని స్థానికులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

వైకుంఠధామాల నిధులు నిల్....

వైరా మున్సిపాలిటీలో వైకుంఠధామాల నిర్మాణాలకు నిధులు కేటాయింపు జరగలేదు. మున్సిపాలిటీలోని పల్లిపాడులో ఉన్న 16 వార్డులో మాత్రమే మోడల్ వైకుంఠదామాన్ని నిర్మించారు. విలీన గ్రామాలైన గండగలపాడు, సోమవరం, దిద్దిపూడి, లాలాపురం, గుండ్రాతి మడుగు, బ్రాహ్మణపల్లితో పాటు మిగిలిన వార్డుల్లో వైకుంఠధామల నిర్మాణం జరగలేదు. సోమవారం (వైరా) మేజర్ గ్రామపంచాయతీ సంబంధించిన రికార్డులు మాయమయ్యాయి. దీంతో మంచినీటి కుళాయిలు వివరాలు మున్సిపాలిటీలో లేవు. అయితే కుళాయిల వివరాలు లేకపోవడంతో గత మూడేళ్లుగా మంచినీటి పంపుల బిల్లులు వసూలు జరగడం లేదు.

పశువుల సంతకు గ్రహణం..

వైరాలో దశాబ్దాల చరిత్ర ఉన్న పశువుల సంతకు మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో గ్రహణం పట్టింది. 2020లో కరోనా కాలంలో పశువుల సంతను మూసివేశారు. అప్పటివరకు ప్రతి ఏడాదికి పశువుల సంతతో సుమారు రూ.25 లక్షల ఆదాయం లభించింది. కరోనా అనంతరం మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, పశువుల సంతను పున:ప్రారంభించలేదు. గతంలో పశువుల సంత నిర్వహించిన స్థలంలో ప్రస్తుతం క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం విశేషం.

రూ.1.37కోట్ల నిధులు వృథా

వైరా మున్సిపాలిటీలో అధికారుల నిర్లక్ష్య తీరుతో ఎస్సీ సబ్ ప్లాన్, విలీన గ్రామాల గ్రాంట్‌తో పాటు పట్టణ ప్రగతి నిధులు సుమారు రూ.1.37కోట్లు మునిగిపోయాయని పాలకవర్గ సభ్యులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వైరా మున్సిపాలిటీలో విద్యుత్ శాఖ సమస్యలను పరిష్కరించేందుకు గతంలో సుమారు రూ.54 లక్షల నిధులను కేటాయించారు. ఈ నిధులకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులు పంపారు. అయితే నేటి వరకు ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలకు సంబంధించిన ఎలాంటి సమాచారం తిరిగి రాలేదు. రూ.54 లక్షల నిధులు ఉన్నా.. పనులు ప్రారంభం కాలేదు.

విలీన గ్రామాలకు నిధులేవి..?

మున్సిపాలిటీలో విలీన గ్రామాలకు 33శాతం అభివృద్ధి నిధులు కేటాయించాలనే నిబంధన ఉందని కొంతమంది పాలకవర్గ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఈనిబంధన ప్రకారం విలీన గ్రామాలకు నిధులు కేటాయింపు జరగడం లేదని విలీన గ్రామాల కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. వైరా మున్సిపాలిటీలో వారసత్వ భూముల ఇళ్లతో పాటు, విలీన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ సమస్యలు వేధిస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed