- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జనరల్ నియోజకవర్గాల్లో పొంగులేటి అభ్యర్థులు ఎవరో..?
దిశ, వైరా :" మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం నుంచి జిల్లాలోని ప్రధానమైన మూడు జనరల్ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు? అసలు పొంగులేటి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తారా.. లేదా ఎంపీ స్థానం వైపు మొగ్గు చూపుతారా? ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పొంగులేటి అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైన వేళ.. జనరల్ స్థానాలపై పొంగులేటి వర్గంలో తర్జనభజన నెలకొందా..పాలేరులో పొంగులేటి మద్దతు తన ఆత్మబంధువైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కు ఖాయమైందా" అనే అంశాలు ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ సర్కిలలో తీవ్రంగా చర్చ జరుగుతుంది.
పొంగులేటి బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేసి ప్రజల మద్దతును కూడగొట్టుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు కేవలం పొంగులేటి తమ సామాజిక వర్గాలకు కేటాయించిన నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తూ తమనే టార్గెట్ చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జనరల్ నియోజకవర్గాల్లో పొంగులేటి అభ్యర్థులను ప్రకటించే ధైర్యం చేయటం లేదని ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శల్లో పరోక్ష అర్థం వస్తుంది. ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారుతుంది. ఖమ్మం ఎంపీ స్థానంతో పాటు, ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్ నియోజకవర్గాల్లో పొంగులేటి అభ్యర్థుల పేర్లు అనధికారికంగా కూడా చర్చకు రాకపోవటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో జిల్లా ప్రజలతో పాటు పొంగులేటి వర్గీయులకు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఆ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జనరల్ అసెంబ్లీ స్థానాలైనా ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పొంగులేటి వర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే విషయమై జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా వైయస్సార్ టీపీ పార్టీ నుంచి పోటీ చేసిన పొంగులేటి విజయం సాధించారు. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పొంగులేటి ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తుంది. పొంగులేటి ఖమ్మం లేదా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతారనేది బహిరంగ రహస్యమే. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉన్నా.. పొంగులేటి ఖమ్మం అసెంబ్లీ నుంచే పోటీ చేసేందుకు అత్యధిక అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్న పొంగులేటి బీజేపీ పార్టీలో చేరటం లాంచనప్రాయమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
బీజేపీ పార్టీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఖమ్మం అసెంబ్లీ నుంచే పోటీ చేయించాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. ఇదే జరిగితే కొత్తగూడెం అసెంబ్లీకి అభ్యర్థి కోసం పొంగులేటి అన్వేషణ కొనసాగిస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్.. కొత్తగూడెం నుంచి పోటీ చేయించేందుకు భూకంటి గోపాలరావు పేరును పొంగులేటి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడానికి చెందిన గోపాలరావు కాంట్రాక్టర్ గా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ ఏ అభ్యర్థిని నిలబెట్టిన ఆ అభ్యర్థికి ధీటుగా పోటీ ఇచ్చేందుకు పొంగులేటి అభ్యర్థులు అన్వేషణ కొనసాగుతుంది.
ఇప్పటివరకు కొత్తగూడెం నుంచి భూకంటి గోపాలరావు పేరు ఒక్కటి మాత్రమే పరిశీలన జరుగుతుంది. మరో జనరల్ నియోజకవర్గమైన పాలేరులో పొంగులేటి వర్గం అభ్యర్థిని నిలిపేందుకు వెనకడుగు వేస్తుంది. పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తుండటంతో ఆమెకు పొంగులేటి మద్దతు తెలపటం ఖాయమని ఆయన వర్గీయులే పేర్కొంటున్నారు. పొంగులేటి తాను చేరబోయే పార్టీతో వైయస్సార్ టీపీ పొత్తు పెట్టుకునే విధంగా తన శాయశక్తుల కృషి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ టీపీ తాను చేరే పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పొత్తు పెట్టుకోకపోయినా.. స్థానిక రాజకీయ సమీకరణను అడ్డుపెట్టుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయినా వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచనలో పొంగులేటి ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో, జిల్లాలో రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నా పాలేరు లో మాత్రం షర్మిల కు పొంగులేటి మద్దతు తెలపాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్లు సమాచారం.
ఖమ్మం ఎంపీ స్థానంపై ముందు జాగ్రత్త
పొంగులేటి తన వర్గం నుంచి ఖమ్మం ఎంపీ స్థానంకు అభ్యర్థిని ఎంపిక చేయకుండానే ముందు జాగ్రత్త పడుతున్నారు. ఖమ్మం ఎంపీ స్థానాన్ని తనకు రెండో ఆప్షన్ గా పొంగులేటి రిజర్వ్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన ఆరు నెలల తర్వాత దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఖమ్మం అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనలో ఉన్న పొంగులేటి ఎంపీ స్థానాన్ని ముందు జాగ్రత్తగా రిజర్వుల్లో ఉంచుకున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గంలో ప్రతికూల ఫలితాలు వస్తే భవిష్యత్తు రాజకీయాల కోసం ఖమ్మం ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించకుండా ఖాళీగా ఉంచుతారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తాను పోటీ చేసే నియోజకవర్గంలో ఆశించిన ఫలితం రాకపోతే మరల ఆరు నెలల్లో జరిగే ఎంపీ ఎన్నికల్లో తాను పోటీ చేసేలా పొంగులేటి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.
ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖాయమైనట్లేనా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మిగిలిన ఎస్సీ, ఎస్టీ ఏడు నియోజకవర్గాల్లో పొంగులేటి అభ్యర్థులు దరిదాపు ఖరారు అయినట్లే స్పష్టమవుతుంది. వైరా నుంచి భానోత్ విజయభాయి, అశ్వారావుపేట నుంచి జారే ఆదినారాయణ, ఇల్లందు నుంచి కోరం కనకయ్య, మధిర నుంచి కోటా రాంబాబు, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, సత్తుపల్లి నుంచి మట్టా దయానంద్, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు పొంగులేటి అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగి అవకాశముంది. అయితే మిగిలిన మూడు జనరల్ నియోజకవర్గాలతో పాటు ఖమ్మం ఎంపీ స్థానానికి పొంగులేటి వర్గం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జనరల్ అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు రసవత్తరంగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.