మేమున్నాం... పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం

by Sridhar Babu |

దిశ బ్యూరో/ ఖమ్మం రూరల్ : వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వ సహాయంతోపాటు... పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సహాయం అందిస్తామని ముందుకొచ్చారు పొంగులేటి ఫ్యామిలీ. ఒక్కో కుటుంబానికి నిత్యావసరాల కిట్ తో పాటు ఐదు వేల నగదును స్వయంగా ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్నారు. తొలిరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధురి, సోదరుడు ప్రసాద్ రెడ్డి వివిధ కాలనీల్లో తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి ఆర్థిక సహాయం అందజేశారు. వరద బీభత్సానికి సర్వం కోల్పోయిన పాలేరు నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలకు మేమున్నామనే భరోసా కల్పిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ధైర్యం చెబుతూ పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున ఆర్థిక సాయం అందిస్తున్నారు. మంత్రి హెూదాలో పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పాలేరు నియోజకవర్గంలోని ఒక్కో బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరుపున రూ. 16,500 నష్టపరిహారంతో పాటు నిత్యావసరాలను సకాలంలో చేర్చడంలో సఫలీకృతులయ్యారు. ఎనలేని సేవా దృక్పథం కలిగిన పొంగులేటి తొలుత తమ పీఎస్ఆర్ ట్రస్ట్ తరుపున వారం రోజుల పాటు మూడు పూటలా బాధిత కుటుంబాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ట్రస్ట్ సభ్యులు, పార్టీ నాయకుల సహకారంతో బాధితుల ఇళ్ల వద్దకు ఆహారాన్ని పంపించారు. ప్రభుత్వం తరుపున అందిన సాయంతో పాటు తమ ట్రస్ట్ తరుపున ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం తీసుకుని తన సతీమణి పొంగులేటి మాధురి, సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు వై. రామకృష్ణారెడ్డి, డి. శ్రీనివాస రెడ్డి తో పాటు ఇతర కుటుంబ సభ్యుల ద్వారా బాధిత కుటుంబాలకు సాయం అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పాలేరు నియోజకవర్గంలో వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ. 5వేలు ఆర్థికసాయంతో పాటు రెండు దుప్పట్లు, రెండు చీరలు, లుంగీలు, టీషర్ట్ లు, టవల్స్ ను అందిస్తున్నారు. అందులో భాగంగా ఖమ్మం రూరల్ మండలంలోని నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీలో 214, రాజీవ్ గృహకల్పలో 249, వికలాంగుల కాలనీ, సాయి నగర్ లోని 222, జలగం నగర్ లో 721, కేబీఆర్ నగర్ లో 199, టెంపుల్ సిటీలో 308, సాయి ప్రభాత్ నగర్ లో 111, అభయ టౌన్ షిప్ లో 527, దానవాయిగూడెంలో 527, రామన్నపేటలో 719 కుటుంబాలకు శనివారం రోజున సాయం అందించారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగిస్తామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. సాయం అందుకున్న బాధిత కుటుంబాలు తాము నమ్మి గెలిపించుకున్న పొంగులేటి శీనివాసరెడ్డి తమకు అన్ని విధాలుగా అండగా నిలవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed