- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఖమ్మం కారులో అసమ్మతి..!
దిశ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం బీఆర్ఎస్ పార్టీలో ఓ వర్గం అసంతృప్తితో రగిలిపోతున్నదా..? పదవుల పందేరంతో చిచ్చు అంటుకుందా..? ఆర్యవైశ్యులు కారు పార్టీ నుంచి పక్క చూపులు చూస్తున్నారా? అంటే పరిస్థితి అలాగే కనిపిస్తున్నది.. అసలే కారు పార్టీలో ఓవర్ లోడ్ కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. వర్గవిభేదాలతో పార్టీ పరిస్థితి ప్రతికూలంగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు ఇటీవల పదవుల పందేరంతో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ఆర్యవైశ్యులు తమ అసమ్మతి రాగాన్ని బహిరంగంగానే వెలిబుచ్చుతున్నారు. ఇటీవల ఏఎంసీ చైర్మన్ పదవిని ఓ మహిళా కార్పొరేటర్ కు కట్టబెట్టడంతో బాటు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మంత్రి పువ్వాడ చేసిన వ్యాఖ్యలతో ఆర్యవైశ్య నేతలు అదే వేదికపై తమ అసంతృప్తిని తీవ్ర స్థాయిలో బయటపెట్టారు.
బీఆర్ఎస్ పార్టీలో ద్వితీయశ్రేణి నాయకులతోపాటు కొన్ని సామాజిక వర్గాల వారు కూడా ఎన్నో ఏండ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా పదవులు తమకు దక్కడం లేదంటూ కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయినా తమకూ మంచిరోజులు వస్తాయంటూ వేచిచూసే ధోరణిలో ఉన్నారు. తమ సేవలను వినియోగించుకుంటూ ఎలాంటి పదవులను కట్టబెట్టకుండా కేవలం తమవారిగా ముద్రపడ్డ వారికి మాత్రమే ఇస్తున్నారనే భావన ఆర్యవైశ్యుల్లో కొంతకాలంగా నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలో ఎలాంటి పదవులు ఏండ్లుగా రాకపోవడంతో సందర్భం దొరికినప్పుడల్లా తమ అసంతృప్తిని జిల్లా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. అయినా వారికి ఎలాంటి పదవులు మాత్రం దక్కడం లేదు..
ఏఎంసీ పీఠం కట్టబెట్టడంతో..
ఖమ్మం ఏఎంసీ చైర్మన్ పదవీకాలం గత నెలలో ముగియడంతో కొత్తపాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. అయితే ఓపెన్ కేటగిరీలో ఏఎంసీ చైర్మన్ పీఠమైన తమవారికి దక్కుతుందని ఆర్యవైశ్యులు ఆశగా ఎదురుచూశారు. కానీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రం కార్పొరేటర్ దోరేపల్లి శ్వేతకు కట్టబెట్టడంతో ఆర్యవైశ్యుల ఆగ్రహం తీవ్రస్థాయికి చేరింది. అయితే శ్వేత ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వివాహమాడింది. ఈ సమీకరణతో శ్వేతకు ఏఎంసీ చైర్మన్ పదవి కట్టబెట్టడంతోనే ఆర్యవైశ్యులు చల్లబడతారని పార్టీ నేతలు భావించినట్లు తెలుస్తోంది.
ఆజ్యం పోసిన అజయ్ మాటలు..
అసలే అసంతృప్తితో రగిలిపోతున్న ఆర్యవైశ్యుల్లో ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాటలు ఆర్యవైశ్యుల ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేశాయి. ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ.. ముదిరాజ్ బిడ్డ.. ఆర్యవైశ్యుల కోడలికి ఏఎంసీ పీఠం ఖరారు చేయడంతో ఆర్యువైశ్యులకు చేసినట్టే అని అనడంతో.. సమావేశానికి హాజరైన ఆర్యవైశ్య పెద్ద, కన్యకా పరమేశ్వరి టెంపుల్ చైర్మన్ మేళ్ల చెరువు వెంకటేశ్వర్లు అదే స్టేజీపై మంత్రి ఎదుటే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'మాకు పదవులు ఇవ్వకున్నా మంచిదే కానీ.. ఆమెకు ఇచ్చి ఆర్యవైశ్యులు పదవు ఇచ్చామనడం సమంజసం కాదు. ఆర్యవైశ్యులు అన్ని కులాల అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకున్నారని.. అయితే అన్ని పదవులు మాకు వచ్చాయా' అంటూ తన అసహనాన్ని తీవ్రంగా వ్యక్త పరిచి, స్టేజీ దిగి వెళ్లబోయారు.
ఆర్యవైశ్యుల పక్కచూపులు..
నగరంలో బలమైన సామాజిక వర్గంగా, పది వేలకు పైగా ఓటు బ్యాంకు కలిగి ఉన్న ఆర్యవైశ్యులను పార్టీ కోసం ఉపయోగించుకున్నారే తప్ప పదవులు ఏమీ ఇవ్వడం లేదంటూ ఎప్పటినుంచో అసంతృప్తిగా ఉన్నారు. కాగా ఆర్యవైశ్య సామాజిక వర్గం ఎన్నికలను తీవ్ర ప్రభావం చూపుతారు. అయితే వీరి బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటినుంచో మద్దతిస్తూ వస్తున్నారు. అయినా వారికి ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో ఇప్పుడు వారు పక్కపార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ఏఎంసీ చైర్మన్ పదవికి కూడా తమ వర్గానికి రాకపోవడంతో ఒక్కసారి అసంతృప్తి బయటపడింది.. మేళ్ల చెరువు వెంకటేశ్వర్లు మాట్లాడింది సమంజసమే అని ఆ వర్గం నేతలు సమర్థిస్తున్నారు. అంతేకాదు ఈసారి వారు బీజీపీకి మద్దతివ్వవచ్చనే ప్రచారం జరుగుతోంది..