మావోయిస్టు పార్టీ సంబరాలపై ఆదివాసీ హక్కుల సంఘం పేరిట సంచలన లేఖ

by Naresh |
మావోయిస్టు పార్టీ సంబరాలపై ఆదివాసీ హక్కుల సంఘం పేరిట సంచలన లేఖ
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం: ఆదివాసీ హక్కుల సంఘం పేరిట గురువారం ఒక లేఖ విడుదలైంది. మావోయిస్టు పార్టీ చేస్తున్న 20 సంవత్సరాల సంబరాలు ఎందుకోసం.. ఎవరికోసం? అంటూ లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడా లేఖ సోషల్ మీడియాలో చర్చలకు తెరలేపింది. అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఆదివాసి ప్రజలకు మావోయిస్టులు దూరం చేస్తున్నారని గురువారం ఆదివాసీ హక్కుల సంఘం పేరిట విడుదల అయిన లేక సోషల్ మీడియాలో చర్చలకు తెరలేపింది.

విడుదల అయిన లేఖలో ఇలా ఉంది..

గత 20 సంవత్సరాలలో మా ఆదివాసి దళిత బిడ్డల బతుకులను ఛిద్రం చేసి, చదువులకు, ఉద్యోగాలకు, ఉపాధికి దూరం చేసి, ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను మాకు అందకుండా చేసినందుకా మావోయిస్టు పార్టీ సంబరాలు చేసుకుంటున్నది?. మావోయిస్టు పార్టీ మాయదారి మాటలను, పాటలను నమ్మి పార్టీలో చేరిన సుమారు 5,500ల బిడ్డల ప్రాణాలు పోగొట్టినందుకా మీరు సంబరాలు జరుపుకుంటున్నది.? అంటూ ప్రశ్నించారు.

అంతేకాకుండా.. నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా సమసమాజాన్ని స్థాపిస్తామని మీ రాజ్యాంగంలో రాసుకున్నప్పటికీ, ఆధిపత్య కులాలకు చెందినవారే మీ పార్టీలో అగ్ర నాయకులుగా చలామణి అవుతూ.. మా ఆదివాసి దళిత బిడ్డలను అణగదొక్కుతూ, ఇన్ఫార్మర్ల పేరుతో నీల్పో ఆడ బిడ్డలను హత్య చేసినందుకా మీ సంబరాలు.? మీ పార్టీలోని ఆధిపత్య కులాల అగ్రనాయకుల మధ్య తలెత్తిన విభేదాలను కప్పిపుచ్చుకునేందుకు, మా ఆదివాసి బిడ్డల ఆటపాటలతో సంబరాలు జరుపుతున్నారు. ఎందుకు? అని లేఖలో ప్రస్తావించారు.

హక్కుల సంఘాల పేరుతో నిజ నిర్ధారణ చేస్తామని బయలుదేరిన నాయకులు,మావోయిస్టులు హత్య చేసిన మా దళిత జాతి బిడ్డ నీల్పో మృతి పైన నిజనిర్ధారణ ఇంతవరకు ఎందుకు చేయలేదు.? బూటకపు నూతన ప్రజాస్వామిక విప్లవం పేరుతో బాంబులు పేల్చి, మా ఆదివాసి బిడ్డలను, మా పశువులను బలిగొన్నందుకా మీ సంబరాలు? మా బతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి. ఈ ఆధునిక ప్రపంచంలో మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మాకు తక్షణం కావాల్సింది విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు, రవాణా సౌకర్యాలు, సమాచార వ్యవస్థ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల ప్రగతి కోసం కృషి చేస్తుంటే.. బూజు పట్టిన సిద్ధాంతంతో ప్రజాస్వామిక విప్లవమని, సమ సమాజమని మీరు పగటి కలలు కంటూ.. మా జీవితాలను, మా బిడ్డల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు. మమ్మల్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచుతున్నారు. అంటూ.. వారు విడుదల చేసిన లేఖలోని ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed