తీన్మార్ మల్లన్న గెలుపును ఎవరూ ఆపలేరు

by Sridhar Babu |
తీన్మార్ మల్లన్న గెలుపును ఎవరూ ఆపలేరు
X

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపును కేసీఆర్ ముక్కు నెలకు రాసినా ఆపలేరని, లక్షా పాతికవేల మెజారిటీ తో ఘన విజయం సాధిస్తారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. తీన్మార్ మల్లన్నపై 100 కేసులు ఉన్నాయని బీఆర్ఎస్ వారు

అంటున్నారని, గత ముఖ్యమంత్రి నియంత పోకడను, ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించినందుకు, వేలెత్తి చూపినందుకే ఈ అక్రమ కేసులు బనాయించి, తిప్పిన పోలీస్ స్టేషన్ తిప్పకుండా.. జైల్లో పెట్టి పైశాచికానందం పొందారని అన్నారు. భార్యాబిడ్డలను హింసించారని.. కేసీఆర్ కు ఇంగిత జ్ఞానం లేదని, ఆయన తీరును సమ సమాజం హర్షించదని తెలిపారు. గత ఎన్నికల్లోనే తీన్మార్ మల్లన్న గెలిచేవాడని, గట్టి పోటీ ఇచ్చారని.. కేసీఆర్ తిమ్మిని బమ్మి చేసి గట్టెక్కారని విమర్శించారు. ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్ వైఫల్యంతో వచ్చిందని.. పట్టభద్రులంతా తీన్మార్ మల్లన్నను గెలిపించి, ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టి చట్టసభకు పంపాలని కోరారు.

బీజేపీకి ప్రజల కష్టాలు పట్టవు

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ నమ్మించి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఆ తర్వాత ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి.. ఉపాధి అవకాశాలను దెబ్బతీసిందని అన్నారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను విస్మరించారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవని, ఈ లోక్​సభ ఎన్నికల్లో ఉన్న కొద్ది సీట్లూ ఊడతాయని చెప్పారు.

శీనన్నా.. చట్టసభకు తీసుకెళ్లన్నా : తీన్మార్ మల్లన్న

" అన్నా.. పొంగులేటి శీనన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపించి.. చట్టసభకు తీసుకెళ్లన్నా.." అని ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని వేదికపై ఆప్యాయంగా కోరారు. గత ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్ తీన్మార్ మల్లన్న పట్ల కక్షపూరితంగా వ్యవహరించాలని, రోజుల తరబడి జైల్లో పెట్టి, భార్యా బిడ్డలకు మనశ్శాంతి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై వారి కుతంత్రాలు చెల్లబోవని అన్నారు. బీఆర్ఎస్ పట్టభద్రులను రోడ్డున పడేసిందని, వారి స్వార్థానికే ఈ ఉప ఎన్నిక వచ్చిందని తెలిపారు.

సర్కారు బడిలో చదివి సేవ చేస్తున్న..

బీఆర్ఎస్ వారు అమెరికా నుంచి అభ్యర్థిని దించారని, తాను చదివింది సర్కారు బడిలోనే అయినా వందమందికి విద్యా బోధన చేయిస్తున్నానని తీన్మార్ మల్లన్న అన్నారు. ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచానని, కేసులకు బెదరలేదని, ప్రాణం ఉన్నంతవరకు జనం బాటలోనే నడుస్తానని అన్నారు. పట్టభద్రులు, ప్రజా సమస్యలను చట్టసభలో వినిపిస్తానని.. ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ చార్జ్ రఘునాథ్ యాదవ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర విద్యా, మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు,

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, సీపీఐ నాయకులు దండి సురేష్, జెడ్పీటీసీ బెల్లం శ్రీను, ఎంపీపీ బోడ మంగీలాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, రైట్ చాయిస్ అధినేత మెండెం కిరణ్, నాయకులు చావా శివరామకృష్ణ, నెల్లూరి భద్రయ్య, మద్ది మల్లారెడ్డి, కొడాలి గోవింద రావు, కొప్పుల అశోక్,మద్ది కిశోర్ రెడ్డి వందలాదిమంది పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed