- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయిల్ ఫాం రైతులకు మహర్దశ
దిశ, శ్వారావుపేట టౌన్ : రెండేళ్ల నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆయిల్ ఫాం రైతులకు ఇక మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే నూనెపై సుంకం విధించటంతో గెలల ధర భారీగా పెరగనుంది. దీంతో ఆయిల్ ఫాం రైతులకు ఆర్థిక భరోసా లభించనుంది. వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఆయిల్ ఫాం రైతులకు మంచి రోజులు రానున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో ఆయిల్ ఫాం సాగు విస్తరణ ఆశాజనకంగా మారొచ్చని ఆయిల్ ఫెడ్ అంచనా వేస్తుంది. ఇతర పంటలు సాగు చేసే రైతులు ఆయిల్ ఫాం పంట వేయాలని అధికారులు కోరుతున్నారు. రైతులకు దీర్ఘకాలిక నికర ఆదాయం అందించే ఆయిల్ ఫాం సాగు రెండేళ్ల నుంచి పతన దశకు చేరింది. సాగు ప్రారంభంలో రైతులు అంతగా ఆసక్తి చూపలేదు. తర్వాత కాలంలో సాగు వైపు అడుగులు వేశారు. ఈ దశలోనే సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న జలగం వెంకట్రావు అశ్వారావుపేటలో 2005లో ఫ్యాక్టరీని నిర్మించారు.
దళారీ వ్యవస్థ లేకుండా రైతుల నుంచి పంట నేరుగా ఆయిల్ ఫెడ్ కొనుగోలు చేయటంతో పాటు రవాణా చార్జీలను చెల్లించటంతో సాగు విస్తరణ పెరుగుతూ వచ్చింది. టన్ను గెలల ధర రూ.10 వేలు ఉండాలన్న డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమైంది. దమ్మపేట మండలం అప్పారావుపేటలో రెండో ఫ్యాక్టరీ నిర్మాణంతో సాగు విస్తరణ ఊపందుకుంది. తర్వాత కాలంలో సాగు విస్తరణ విపరీతంగా పెరిగింది. 2022లో రష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో ఉక్రెయిన్ నుంచి దిగుమతి అయ్యే సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు లేక ఆయిల్ ఫాం డిమాండ్ పెరగటంతో టన్ను గెలల ధర ఏకంగా రూ.23 వేలకు చేరింది. దీంతో ఒక్కసారిగా ఎక్కువ మంది రైతులు సాగు బాట పట్టారు. 2022 సంవత్సరం వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం 7 నుండి 8 వేల మంది రైతులు సుమారు 32 వేల ఎకరాల్లో సాగు చేశారు.
గెలల ధర రూ.23 వేలకు పెరిగిన తర్వాత రైతులు ఆయిల్ ఫాం సాగుపై ఎక్కువ ఆసక్తి చూపటంతో ఈ రెండేళ్ల కాలంలో ఏకంగా 14 వేల మందికి పైగా రైతులు 45 వేల ఎకరాల్లో సాగును మొదలుపెట్టారు. ఇప్పుడు సుమారు 80 వేల ఎకరాల్లో సాగు అవుతోంది. అత్యధికంగా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోనే సాగులో ఉంది. 10 లక్షల ఎకరాల్లో సాగు పెంపు లక్ష్యంగా హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఆయిల్ ఫెడ్ కు 8 జిల్లాలు, మిగతా 23 జిల్లాలను 12 ప్రైవేట్ కంపెనీలకు కేటాయించింది. ఇప్పుడు రాష్ట్రంలో సుమారు 2.03లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగవుతోంది.
పెరగనున్న గెలల ధర
దిగుమతి సుంకం విధింపుతో ఆయిల్ ఫాం గెలల ధర భారీగా పెరగనుంది. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ. 14,392 ఉంది. ఈ ధరకు అదనంగా రూ.1,700 నుండి రూ.2 వేల వరకు పెరగవచ్చని ఆయిల్ ఫెడ్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో టన్ను గెలల ధర ఇకపై రూ.18 వేలు దాటనుంది. గెలల ధర రూ.23 వేలు ఉన్నప్పుడు తోటల నిర్వాహణ ఖర్చు భారీగా పెరిగింది. అయినా గిట్టుబాటు ధర ఉండటంతో రైతులకు అంతగా ఆర్థిక సమస్య లేదు. కానీ తర్వాత కాలంలో ధర తగ్గుముఖం పట్టడంతో రైతులను ఆర్థిక నష్టం వెంటాడింది. గెలల ధర కనీసం రూ.15 వేలకు పైగా ఉండాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర అమలు చేయాలని కోరుతున్నారు.
మంత్రి తుమ్మల చొరవ
కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని ఎత్తివేయటంతో పతనమైన ఆయిల్ ఫాం ధరను మళ్లీ పెరిగే విధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకున్నారు. ఎత్తివేసిన దిగుమతి సుంకాన్ని మళ్లీ అమలు చేయాలని ఇప్పటికే రెండు సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన అధిక వర్షాలతో నష్టపోయిన ఖమ్మం జిల్లాలో నష్టం అంచనా కోసం వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి ఆయిల్ ఫాం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు స్పందించిన కేంద్రం దిగుమతి సుంకాన్ని 20 శాతం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల గెలల ధర పెరగనుంది.
ఆయిల్ ఫాం పంటకు మారండి : జంగా రాఘవరెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్
రైతులకు నికర ఆదాయం అందించే ఆయిల్ ఫాం సాగు వైపు ఆసక్తి గల రైతులు పంట మార్పిడి చేయాలి. కనీస గిట్టుబాటు ధర టన్నుకు రూ.18 వేలకు పైగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం అమలు చేస్తున్నట్లు ప్రకటించటం శుభపరిణామం. ఆయిల్ ఫాం సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఆశాజనకంగా సాగు విస్తరణ : ఆకుల బాలకృష్ణ, ఆయిల్ ఫెడ్ డివిజనల్ ఆఫీసర్, అశ్వారావుపేట
ఆయిల్ ఫాం గెలల ధర పెరగనుండటంతో సాగు విస్తరణ లక్ష్యం ఆశాజనకంగా ఉండనుంది. ఇప్పటికే ఏడాదికి ఆయిల్ ఫెడ్ లక్ష ఎకరాల్లో సాగు విస్తరణ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఆ దిశగా ఆసక్తి గల రైతులను ప్రోత్సహిస్తూ సాగు పెంపుపై దృష్టి సారించాం. సాగు చేసే ప్రతి రైతుకూ సబ్సిడీ పథకాలను సకాలంలో అందిస్తున్నాం. పండించిన పంటను, నేరుగా కొనుగోలు చేసి రవాణా చార్జీలను కూడా చెల్లించేది ఆయిల్ ఫెడ్ సంస్థ మాత్రమే.
- Tags
- oil farm